వార్షిక ఉత్పత్తి లక్ష్యాన్ని ముందుగానే సాధించిన ఎన్టీపీసీ
జాతీయ విద్యుత్ సంస్థ రామగుండం సూపర్ థర్మల్ విద్యుత్ కేంద్రం 2012-13 ఆర్ధిక సంవత్సరానికి నిర్థేశించిన విద్యుత్ ఉత్పత్తి లక్ష్యాన్ని గడువు కన్నా ఐదు రోజుల ముందుగానే సాధించింది. మన రాష్ట్రంలో విద్యుత్ కోతలు, విద్యుత్ చార్జీలు వంటి సమస్యలతో పోరాటాల మంటలు రగులుతున్న సమయంలో రామగుండం సూపర్ థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్ణీత గడువు కన్నా ముందుగానే వార్షిక విద్యుత్ ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించి సంచలనం సృష్టించింది. మూడు 200 మెగావాట్ల యూనిట్లు, నాలుగు 500 మెగావాట్ల యూనిట్లు కలిసి రోజుకు 2600 మెగావాట్ల విద్యుత్‌ను రామగుండం సూపర్ థర్మల్ విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి చేస్తారు. కాగా 2012-13 ఆర్ధిక సంవత్సరానికి ఈ ప్రాజెక్టులో 20,448 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని వార్షిక లక్ష్యంగా నిర్ణయించారు. ఈనెల 31నాటికి ఈ ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించాల్సి ఉండగా రామగుండం ఎన్టీపీసీ సూపర్ థర్మల్ ప్రాజెక్టులో మంగళవారం సాయంత్రం (మార్చి 26, 2013) వరకే వార్షిక లక్ష్యాన్ని అధిగమించి జాతీయ స్థాయి అభినందనలు పొందారు. ఈమేరకు రామగుండం ఎన్టీపీసీ ఉద్యోగులను, ఇంజనీర్లను జాతీయ స్థాయి ఎన్టీపీసీ అధికారులు ప్రత్యేకంగా అభినందించారు. దక్షిణ భారతదేశానికి వెలుగులు ప్రసాదిస్తున్న రామగుండం ఎన్టీపీసీ ప్రాజెక్టు అన్ని అవాంతరాలను అధిగమిస్తూ, విద్యుత్ ఉత్పత్తిలో ఎదురవుతున్న సవాళ్లను ధీటుగా ఎదుర్కొంటూ, రక్షణ తదితర నిబంధనలను నిక్కచ్చిగా పాటిస్తూ వార్షిక విద్యుత్ ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించటం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతున్నది.91శాతం ప్లాంటు లోడ్ ఫ్యాక్టర్ (పి.ఎల్.ఎఫ్) సగటు సామర్ధ్యంతో ఈ ప్రాజెక్టు గురువారం వరకు 20,600 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి సాధించింది. తక్కిన మూడు రోజుల్లో మరో 150 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తిని సాధిస్తారని కూడా భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టులోని మొదటి, రెండవ 200మెగావాట్ల సామర్ధ్యం గల రెండు యూనిట్లు ఈ ఆర్ధిక సంవత్సరంలో ఎలాంటి అవాంతరాలు లేకుండా విద్యుత్ ఉత్పత్తిని చేయడం ఒక రికార్డుగా మారింది. ఈ విద్యుత్‌ను ఉత్పత్తి చేయడానికి రామగుండం ఎన్టీపీసీ ప్రాజెక్టు దేశంలోనే వివిధ బొగ్గు గనుల సంస్థల నుండి 130 లక్షల టన్నుల బొగ్గును వినియోగించింది. రాష్ట్రంలోని విద్యుత్ ఉత్పత్తి సంస్థలు వివిధ ఇబ్బందులను ఎదుర్కొంటూ వార్షిక విద్యుత్ ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించే ప్రయత్నాలు చేస్తుండగా రామగుండం ఎన్టీపీసీ ప్రాజెక్టు ముందుగానే లక్ష్యాన్ని సాధించడం విశేషంగా పేర్కొంటున్నారు.