రామగుండం కార్పోరేషన్‌లో తాగునీటికి రూ.60 లక్షల నిధులు
ఎండాకాలంలో తాగునీటి ఎద్దడి తీర్చేందుకు ప్రత్యామ్నాయ చర్యల్లో భాగంగా రూ.60లక్షల నిధులు కేటాయిస్తున్నట్లు పెద్దపల్లి ఎంపీ వివేక్ తెలిపారు. రామగుండం కార్పోరేషన్ పరిధిలోని ప్రజల తాగునీటి సమస్యను తొలగించడానికి శుక్రవారం కార్పోరేషన్‌లో ఎంపీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆ నిధులతో గోదావరినది వద్ద కొత్తగా 15 బోర్లు వేయాలని, ప్రస్తుతం పనిచేయని బోర్లకు మరమ్మత్తు చేయించాలని అధికారులకు సూచించారు. నగరవాసులకు రోజు విడిచి రోజు తాగునీటిని సరఫరా చేయాలని అదేశించారు. తాగునీటి సమస్యను శాశ్వత పరిష్కారాలనికి ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి పైపులైను కోసం చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. రాజీవ్ రహదారి విస్తరణ పనులలో దెబ్బతిన్న ప్రధాన పైపులైను నిర్మాణానికి రూ.12కోట్లతో అంచనాలు రూపొందించామని, దీనిపై రోడ్లు భవనాల శాఖ ఆమోదం కోసం కృషిచేస్తామన్నారు. లేదంటే స్థానికులు ఆందోళన తీవ్రతరం చేస్తారని, అవసరమైతే తాను సైతం ఆందోళనలో పాల్గొంటానన్నారు. సింగరేణి క్రమబద్దీకరించిన స్థలాల్లో గృహాల నిర్మాణాలతో పాటు పేరు మార్పిడి సులభతరం చేయాలని బల్దియా అధికారులను కోరారు.