దీపం కిందే చీకటి
రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఎడాపెడా కరెంటు కోతలు
కరెంటుకు పుట్టినిల్లుగా పేరుగాంచిన రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోనే కరెంటు కోతలు విచ్చలవిడిగా కొనసాగిస్తున్నారు. వేసవి ఎండలు రాకముందే ఎడాపెడా కరెంటు కోతలు విధించడం వల్ల స్థానికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో నిర్ణీత వేళల్లో కరెంటు కోత విధించేవారు. కాగా ఇటీవలి కాలంలో కరెంటు కోతలకు ఒక వేళా, పాళా లేకుండా చిత్తం వచ్చినట్లు కోత విధిస్తున్నారు. ఇంటర్, ఎస్‌ఎస్‌సి, వార్షిక పరీక్షలకు సిద్దమవుతున్న వందలాది మంది విద్యార్ధులు కరెంటు కోతల కారణంగా తమ చదువును కొనసాగించటం కష్టంగా మారింది. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో (ఎన్టీపీసీ) జాతీయ విద్యుత్ సంస్థ 2600 మెగావాట్ల సామర్ధ్యం గల థర్మల్ విద్యుత్ యూనిట్లను నెలకొల్పింది. ఇందులో 200 మెగావాట్ల సామర్ధ్యం గల మూడు యూనిట్లు, 500 మెగావాట్ల సామర్ధ్యం గల నాలుగు యూనిట్లు విద్యుత్ ఉత్పత్తిని కొనసాగిస్తున్నాయి. ఈ యూనిట్ల ద్వారా ప్రతీ రోజూ సుమారు 60 మిలియన్ యూనిట్ల విద్యుత్ దక్షిణాది రాష్ట్రాలకు పంపిణీ చేస్తున్నారు. మన రాష్ట్రానికి ప్రతీరోజూ రామగుండం, ఎన్టీపీసీ సూపర్ థర్మల్ కేంద్రం నుంచి 27శాతం విద్యుత్ లభిస్తుంది. ఈ మేరకు ప్రతీ రోజూ సుమారు 700 మెగావాట్ల విద్యుత్‌ను కేటాయిస్తుంటారు. మన రాష్ట్రానికి వచ్చే వాటాతో పాటు ఎన్టీపీసీ ఆధీనంలో ఉండే 15శాతం కోటా సుమారు తొమ్మిది మిలియన్ యూనిట్ల నుండి కూడా మన రాష్ట్రం అత్యవసర పరిస్థితుల్లో అడిగి వినియోగించుకునే అవకాశం ఉంది. ఎన్టీపీసీతో పాటు రామగుండం ప్రాంతంలో రాష్ట్ర విద్యుత్ బోర్డుకు చెందిన 62.5మెగావాట్ల సామర్ధ్యం గల థర్మల్ విద్యుత్ కేంద్రం విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నది.
అన్నీ కలిపి 2662 మెగావాట్లకు పైగా విద్యుత్తు ఉత్పత్తి జరుగుతున్న రామగుండం ప్రాంతంలో కూడా విపరీతంగా కరెంటు కోతలు విధించడం వల్ల దీపం కిందే చీకటి లాగా పరిస్థితి మారిపోయింది.
గతనెలలో ఎన్టీపీసీ మేనేజింగ్ డైరెక్టర్ రామగుండం పారిశ్రామిక ప్రాంతాన్ని సందర్శించినప్పుడు స్థానిక ప్రజాప్రతినిధులు, కార్మిక సంఘాల నేతలు ప్రాంతంలోని బొగ్గు, నీరు వినియోగిస్తున్న కారణంగా దక్షిణాది రాష్ట్రాలన్నింటికీ ఆయా వాటాల మేరకు విద్యుత్ సరఫరా చేస్తున్న ఎన్టీపీసీ రామగుండం పారిశ్రామిక ప్రాంతం పట్ల ప్రత్యేక దృష్టితో వ్యవహరించాలని కోరినారు. ఈ మేరకు రామగుండం మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో విద్యుత్ కోతలు ఉండకుండా చూడాలని కోరారు. ఈ విషయమై పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామని చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ హామీ ఇచ్చారు. కాని ఇంతవరకు ఏ నిర్ణయం తీసుకోలేదు. ప్రభుత్వం తాజాగా నిర్ణయించిన వేళలను కూడా అధికారులు పట్టించుకోవటం లేదు. ప్రతీ రోజూ ఉదయం ఆరు గంటల నుండి రాత్రి పదిగంటల వరకు చిత్తం వచ్చినట్లు గంటల తరబడి కరెంటు కోత విధిస్తున్నారు. కార్పోరేషన్ పరిధిగా గుర్తింపు పొందిన రామగుండం ప్రాంతంలో రోజుకు వివిధ సందర్భాలలో ఆరు నుంచి ఏడు గంటల వరకు కరెంటు కోతలు విధిస్తున్నారు. ఒకవైపు విచ్చలవిడిగా కరెంటు కోతలు విధిస్తూ మరో వైపు సర్ చార్జీల పేరిట ప్రతీనెలా నాలుగు నుంచి ఎనిమిది వందల రూపాలయల మేర అధిక బిల్లులు వసూలు చేస్తున్నారు. కరెంటు బిల్లు చార్జీలు చూసి వినియోగదారులు ఆశ్చర్యపోతున్నారు. అసలు రాష్ట్రంలో ఒక ప్రభుత్వ వ్యవస్థ పనిచేస్తున్నదా? లేదా? అంటూ స్థానికులు విచిత్రంగా ప్రశ్నించుకుంటున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా కొనసాగుతున్న గంటల తరబడి కరెంటు కోతలు, వందల రూపాయల కరెంటు బిల్లుల పట్ల ప్రజలు తీవ్రనిరసన వ్యక్తం చేస్తున్నారు. రానున్న వేసవి ఎండలు తలుచుకుంటూ రామగుండం పారిశ్రామిక ప్రాంత ప్రజలు భయం చెందుతున్నారు.