Friday, 1 March 2013


ప్రత్యేక తెలంగాణ పోరాటంలో గోదావరిఖని జర్నలిస్టులు


ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకై జరుగుతున్న ఉద్యమంలో గోదావరిఖని పాత్రికేయులు కూడా ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌, తెలంగాణ జర్నలిస్టుల ఫోరం సంయుక్తంగా నిర్వహిస్తున్న దీక్షలు, ర్యాలీలు, తెలంగాణ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయడానికి తోడ్పడుతున్నాయి. తెలంగాణ జిల్లాల్లో ప్రప్రథమంగా గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌ సభ్యులు రిలేనిరాహార దీక్షలు ప్రారంభించి ఉద్యమానికి ఊపిరి అందించారు. ప్రతీ ఏడాది జనవరి నెలలో నూతన సంవత్సర ఆరంభ తేదీ నుండి వారం రోజుల పాటు గోదావరిఖని చౌరస్తాలో రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తూ ఇతర పార్టీలకు, కార్మిక సంఘాలకు, ప్రజా సంఘాలకు స్ఫూర్తి కలిగిస్తున్నారు. ఈ ఏడాది కూడా జనవరి నెలలో ర్యాలీలు, పోరు దీక్షలు నిర్వహించి పాత్రికేయులు రామగుండం పారిశ్రామిక ప్రాంతమంతటా సంచలనం సృష్టించారు. ఈ కార్యక్రమంలో అన్ని పార్టీల, కార్మిక, ఉద్యోగ, యువజన, విద్యార్ధి, మహిళా సంఘాల నేతలు, కార్యకర్తలు, స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చి దీక్షలకు సంఘీభావం ప్రకటించారు. పాత్రికేయులు తాము స్వంతంగా ఇచ్చిన విరాళాలతోనే ఈ ఉద్యమాన్ని కొనసాగించటం పట్ల పలువురు ప్రశంసిస్తున్నారు.
ఆరుణోదయ, తదితర స్థానిక కళాకారులు ఉద్యమ పాటలు, నృత్యాలతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను చాటుతూ స్థానికుల్లో ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని పెంపొందించారు. గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌ సభ్యులుగా ఉన్న వంశీ, రామ్మూర్తి, ఎస్‌.కుమార్‌, కోల లక్ష్మణ్‌లు తెలంగాణ జర్నలిస్టుల ఫోరం సంస్థలో నాయకులుగా ఉంటూ కోల్‌బెల్ట్‌ ఏరియాలోని నాలుగు జిల్లాల్లో తెలంగాణ ఉద్యమ బలోపేతానికి కృషిచేస్తున్నారు. కరీంనగర్‌, వరంగల్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లో, హైదరాబాద్‌లో తెలంగాణ విషయమై జరిగిన అన్ని సభలకు గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌ సభ్యులు అధికసంఖ్యలో పాల్గొంటూ ఉద్యమంలో తమవంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నారు. కాంగ్రేస్‌ పార్టీ, దాని అనుబంధ సంఘాల వార్తలను, ప్రెస్‌మీట్‌లను బహిష్కరిస్తూ గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌ తీర్మానించింది. ఈ మేరకు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కాంగ్రేస్‌ పార్టీ వార్తల బహిష్కరణ కొనసాగుతున్నది. ప్రెస్‌క్లబ్‌లో ఆ పార్టీ నేతలు ప్రెస్‌మీట్లు ఏర్పాటు చేయడం కూడా నిషేధించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కాంగ్రేస్‌ పార్టీ చేస్తున్న కపటనాటకాలను ప్రజలకు వివరించటంలో గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌ ప్రత్యేక చొరవచూపింది. కాంగ్రేస్‌ పార్టీ తదితర అనుబంధ సంఘాల నాయకులు, గోదావరిఖని చౌరస్తాలో వారం రోజుల పాటు కనిపించకుండా దాక్కునే పరిస్థితులు ఏర్పడ్డాయి.
 పత్రికా యాజమాన్యాలు పరోక్షంగా హెచ్చరించినా పాత్రికేయులు తమ ఉద్యోగ భద్రతను ఖాతరుచేయకుండా తెలంగాణ ఉద్యమ పోరు దీక్షలను కొనసాగించటం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. విలేకరులకు రాజకీయాలెందుని స్థానిక టీడీపీ నాయకుడు ఒకరు జారీచేసిన ప్రకటనను పాత్రికేయులతో సహా వివిధ రాజకీయ పార్టీల, కార్మిక సంఘాల నేతలు తీవ్రంగా ఖండించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో పాల్గొనకుండా, ఉద్యోమంలో పాల్గొంటున్న వారిపై విడ్డూరమైన వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేత వైఖరిని పలువురు నిరసిస్తున్నారు. గోదావరిఖని పాత్రికేయులు ఆంధ్రప్రదేశ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ యూనియన్‌ (ఏ.పి.యు.డబ్ల్యూ.జె) సమావేశాల్లో కూడా తెలంగాణ ఉద్యమ ఆవశ్యకతను తెలుపుతూ వాదించారు. నెల్లూరులో జరిగిన రాష్ట్ర మహా సభల్లో, వరంగల్‌లో జరిగిన ప్రాంతీయ సదస్సులో గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌ సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జర్నలిస్టుల యూనియన్‌ కూడా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకై పోరాటాలు నిర్వహించాలని సభ్యులు కోరారు. 'తెలంగాణ మార్చ్‌' సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన భారీ ప్రదర్శనకు గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌ సభ్యులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఆ సందర్భంగా పోలీసులు జరిపిన బాష్పవాయువు ప్రయోగంలో నలుగురు సభ్యులు గాయపడ్డారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు జరిగే వరకు ఉద్యమంలో మరింత ఉత్సాహంగా పాల్గొంటూ పోరాటాలను దిగ్విజయం చేస్తామని గోదావరిఖని పాత్రికేయులు స్పష్టం చేశారు. 
Report By 
PITTALA RAJENDER
PRESS CLUB
GODAVARIKHANI