Friday, 1 March 2013


రామగుండం కార్పోరేషన్‌లో...

ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుపై నిర్లక్ష్యం


  • -పారిశ్రామిక ప్రాంతంపై ప్రభుత్వ వివక్ష 
  • -ప్రజల సమస్యలు పట్టని ప్రజాప్రతినిధులు

Ramagundam Tahasildar Office
రామగుండం పారిశ్రామిక ప్రాంతం ప్రత్యేక శ్రేణి మున్సిపాలిటీ నుంచి కార్పోరేషన్‌గా ఏర్పడి మూడు సంవత్సరాలు గడిచిపోయింది. అయినా ఇక్కడి ప్రజలకు ప్రభుత్వ కార్యాలయాలు అందుబాటులో లేకుండా పోవడం ఇక్కడి పాలకుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. రామగుండం కార్పోరేషన్‌ విస్తీర్ణపరంగా, జనాభా పరంగా జిల్లా కేంద్రానికి సమానమైంది. ఈ ప్రాంతంలోని సింగరేణి బొగ్గు గనుల నుండి, విద్యుత్‌ ఉత్పత్తి సంస్థల నుండి వేల కోట్ల రూపాయలు పన్నుల రూపంలో ప్రభుత్వ ఖజానాను నింపుతున్నా.. ఈ ప్రాంతంపై ప్రభుత్వానికి మొదటి నుంచి వివక్షే. ఇక్కడ ప్రజల సౌకర్యం కోసం ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేయించడంలో ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు, నాయకులు విఫలమవుతూనే ఉన్నారు. దాదాపు నాలుగు లక్షల జనాభా కలిగి, విద్యా, వాణిజ్య పరంగా అభివృద్ది చెందిన ఈ ప్రాంతంలో సబ్‌ ట్రెజరీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలంటూ దశాబ్దాలుగా డిమాండ్‌ ఉంది. గతంలో స్థానికంగా ఉన్న డీసీటీఓ కార్యాలయాన్ని ఇక్కడి నుంచి పెద్దపల్లికి తరలించారు. విద్యా, వ్యాపార సంస్థలు ప్రభుత్వ ఫీజులు, ఛలానాలు చెల్లించేందుకు స్థానికంగా ట్రెజరీ కార్యాలయం అందుబాటులో లేకపోవడంతో పెద్దపల్లికి వెళ్లాల్సి వస్తోంది. రామగుండం నియోజకవర్గంలో ఒకే తహసీల్దార్‌ కార్యాలయం ఉండడం వల్ల ప్రజల సరియైన సేవలు అందించలేకపోతున్నారు. లక్షల జనాభా ఉన్న ఈ ప్రాంతంలో కుల, ఆదాయ, నివాస తదితర ధృవీకరణ పత్రాలను జారీ చేయడమే ఆ కార్యాలయానికి గగనంగా మారుతోంది.
రామగుండం మండలంలో మార్కెట్‌ యార్డు, మార్కెట్‌ కమిటీ కోసం ఇక్కడి రైతులు చాలా కాలంగా డిమాండ్‌ చేస్తున్నారు. పారిశ్రామిక ప్రాంతంలో సుమారు 20కి పైగా రైస్‌ మిల్లులు ఉన్నాయి. ఇక్కడి మిల్లులకు సైతం ధాన్యాన్ని పెద్దపల్లి, హుజురాబాద్‌, జమ్మికుంట తదితర ప్రాంతాల నుంచి తెచ్చుకోవాల్సి వస్తోంది. రామగుండం, కమాన్‌పూర్‌ మండలాలకు చెందిన రైతులు ధాన్యం, పత్తి అమ్మకాల కోసం పెద్దపల్లి, జమ్మికుంట ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. ఇక్కడి ప్రజల సౌకర్యం కోసం ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుపై ఉద్యమించాల్సిన విషయాన్ని స్థానిక నాయకులు మరిచారు. ఇటీవల హుజురాబాద్‌ నియోజకవర్గానికి రెండు కార్యాలయాలు, జమ్మికుంటలో ఎస్‌టీవో కార్యాలయం ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హుస్నాబాద్‌ను ప్రత్యేక రెవిన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలనే ప్రయత్నాలు సాగుతున్నాయి. కాగా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని నాయకులు చొరవ చూపకపోవడంతో రామగుండం పేరుకు కార్పోరేషన్‌ హోదా తెచ్చుకున్నా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారింది. గతంలో మంజూరైన డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేయించడంలో స్థానిక నాయకులు విఫలమయ్యారు. కార్పోరేషన్‌ పరిధిలో మహిళా పోలీస్‌ స్టేషన్‌, సబ్‌ రిజిస్ట్రార్‌, సబ్‌ ట్రెజరీ వంటి ముఖ్యమైన ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది. అలాగే రామగుండంలో మార్కెట్‌ యార్డ్‌ ఏర్పాటు చేస్తే రామగుండం, కమాన్‌పూర్‌ మండలాలతో పాటు, ఆదిలాబాద్‌ జిల్లా జైపూర్‌, చెన్నూర్‌ తదితర ప్రాంతాల రైతులకు ఎంతో సౌలభ్యంగా ఉంటుంది. రామగుండం ప్రాంతం మున్సిపాలిటీగా ఉన్నప్పుడు చేపట్టిన మున్సిపల్‌ పార్కు, షాపింగ్‌ కాంప్లెక్స్‌, ఆడిటోరియం వంటి నిర్మాణాలు కార్పోరేషన్‌గా మారి మూడేళ్లు గడిచినప్పటికీ కూడా పూర్తికాలేదు. స్థానిక పరిపాలన వ్యవస్థ లేకపోవడం, అవసరమైన ప్రభుత్వ కార్యాలయాలు అందుబాటులో లేకపోవడంతో ఇక్కడి ప్రజలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా ఈ ప్రాంతానికి ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రజాప్రతినిధులు చొరవ చూపితే తప్ప ఇక్కడి ప్రజలు కష్టాలు తీరవని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.