Slum-Free City Plan for RAMAGUNDAM
రామగుండం గృహ నిర్మాణ పథకంపై స్థానికుల వ్యతిరేకత
Sheds at Vidyanagar |
ఎక్కడికి వెళ్లాలని, ప్రభుత్వం తిరిగి ఇళ్లు నిర్మించే వరకు ఎన్నేళ్లు పడుతుందని, అప్పిటిదాకా తమ బతుకులు ఏంకావాలని గుడిసెల, సిమెంటు రేకుల షెడ్ల వాసులు ప్రశ్నిస్తున్నారు. ఉన్నచోట కనీస సౌకర్యాలు కల్పించలేని నాయకులు, అధికారులు కొత్తగా ఏమిచేస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం చేపట్టిన పథకాలు ఏళ్ల తరబడి పెండింగ్‌లో పడిపోయాయని, ప్రభుత్వ గృహ నిర్మాణ పథకాలన్నీ రాష్ట్రవ్యాపితంగా పూర్తిగా విఫలమయ్యాయని స్థానికులు గుర్తుచేస్తున్నారు. తమకు లేనిపోని ఇబ్బందులు కలిగించవద్దని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. కొన్ని కాలనీల్లో కార్పోరేషన్ అధికారులు ఈ విషయమై నచ్చచెప్పేందుకు ప్రయత్నించగా స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి వారిని తమ కార్యాలయం వైపు పరిగెత్తించే ప్రయత్నం చేశారు. స్థానిక ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ కూడా ప్రస్తుతం బస్తీ పెద్దలను పిలిచి పథకం వివరిస్తున్నా, ఇది ఆచరణలో సాధ్యమయ్యే నమ్మకం లేదని వారంటున్నారు.
Model Apartment for RAY plan |
రామగుండం కార్పోరేషన్ పరిధిలోని 9 నుండి 26వ వార్డుల్లో దాదాపు ఇరవైవేల గుడిసెలు, రేకుల షెడ్లు ఉన్నాయి. వీటిల్లో సింగరేణి కార్మికులు, వారి కుటుంబీకులు, వారి ఆదాయంపై ఆధారపడే ఇతర వృత్తుల వారు, వారి కుటుంబీకులు నివసిస్తున్నారు. సుమారు ఒక లక్ష జనాభ ఈ ప్రాంతంలో గత నలభై సంవత్సరాలుగా నివసిస్తున్నారు. రోడ్లు, మంచినీటి సౌకర్యాలు, విద్య, వైద్య, పారిశుధ్యం వంటి కనీస సౌకర్యాలు అంతగా అందుబాటులోలేని పరిస్థితుల్లో ఈ ప్రాంత ప్రజలు అత్యంత నిరాశజనకమైన రీతిలో బ్రతుకుతున్నారు. తమ ప్రాంతాల్లో వీధి దీపాలు, రోడ్లు, మరుగుదొడ్లు, మంచినీటి సౌకర్యాలు కల్పించాలని ప్రజలు ఏళ్ల తరబడి కోరుతున్నారు. కాని అధికారులు ఎప్పటికప్పుడు తాత్కాలిక పద్ధతిలో సౌకర్యాలు కల్పించి తమ బాధ్యత నుంచి తప్పుకుంటున్నారు. ఫలితంగా నాలుగు దశాబ్దాలుగా గుడిసెలు, రేకుల షెడ్లుగా మారిన కాలనీల్లో కనీస సౌకర్యాలు మెరుగుపడలేదు. అనేక విజ్ఞప్తుల మేరకు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 17982 మంది గుడిసెవాసులకు ప్రభుత్వ పట్టాలు ఇచ్చారు. స్థానికుల నిరసన తీవ్రమౌతున్న నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ, కార్పోరేషన్ అధికారులతో కలిసి 'రాజీవ్ ఆవాస యోజన' అనే శాశ్వత గృహ నిర్మాణ పథకాన్ని చేపట్టి ప్రభుత్వంతో మంజూరు చేయించారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఈ పథకానికి అవసరమైన దాదాపు వెయ్యికోట్ల రూపాలయను మంజూరు కూడా చేసినాయి. ఈ పథకం మేరకు కార్పోరేషన్ పరిధిలోని 9 నుంచి 26వ వార్డుల్లో వ్యాపించి ఉన్న 20613 గుడిసెలు, రేకుల షెడ్లు, 4223 సింగరేణి కార్వర్లు తొలగించి, గ్రౌండ్ లెవెలింగ్ చేస్తారు. ఈ స్థలాల్లో (మల్టీ స్టోరీడ్) బహుళ అంతస్తుల గృహ భవనాలు నిర్మిస్తారు. ఈ గృహాల్లో ఇద్దరు భార్యభర్తలకు ఒక నివాసం చొప్పున ప్రస్తుతం ఉన్న గెడిసెల, షెడ్ల వాసులందరికీ కేటాయిస్తారు.
Huts in Ramagundam slums |
ఆ తర్వాత ఈ భవనాల సముదాయం వద్ద షాపింగ్ కేంద్రాలు, హోటళ్లు, ఇతర వర్తక, వాణిజ్య కేంద్రాలు నిర్మించి కిరాయిల ప్రాతిపదికన కేటాయిస్తారు. ప్రస్తుతం ఉన్న వారందరికీ, ఇళ్లు కేటాయిస్తూనే, బ్యాంకుల నుండి సబ్సిడీ పద్దతిన సులభ వాయిదాలపై ప్రతీ ఒక్కరికీ లక్ష రూపాయల లోన్ ఇప్పిస్తారు. ఆ లోన్ ప్రభుత్వానికి చెల్లిస్తే, మరో 50వేల రూపాయలు ప్రభుత్వ పక్షాన సబ్సిడీ కింద కేటాయిస్తుందని పథకంలో నిర్ధేశించారు. సుమారు 38 లక్షల స్క్వేర్ మీటర్ల (379 హెక్టార్లు) విస్తీర్ణంలో 29560 గృహాలు ఈ బహుళ అంతస్థుల భవనాల్లో నిర్మించి కేటాయిస్తామని కార్పోరేట్ అధికారులు తమ పథకంలో నిర్ధేశించారు. 'రాజీవ్ ఆవాస యోజన' పథకం ఉద్దేశ్యం ఎంతో ఆదర్శంగా ఉన్నప్పటికీ, ఈ పథకం కింద ఇళ్లు ఎప్పటి వరకు నిర్మిస్తారు? అప్పటి దాకా వేలాది మంది ప్రజలు ఎక్కడ నివసించాలి? పథకం మధ్యలో ఏ కారణంతో ఆగిపోయినా పేద ప్రజల భవిష్యత్తుకు ఎవ్వరు బాధ్యత వహిస్తారన్న ప్రధాన ప్రశ్నలకు సమాధానాలు లభించటం లేదు. ప్రస్తుత ఎమ్మెల్యే గానీ, అధికారులు గానీ పథకం పూర్తయ్యేవరకు ఇక్కడే పదవుల్లో ఉంటారా? అనేది స్థానికులు వేస్తున్న ప్రశ్నల్లో ముఖ్యమైంది. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సిద్దం చేసిన అమలుపరిచిన పథకాలేవి ఇంతవరకు సకాలంలో పూర్తయిన దాఖలాలు లేవని కూడా స్థానికులు ఉదాహరణలు చెబుతున్నార,ఉ. ఇన్ని అనుమానాల మధ్య ఈ పథకం అమలు చేయటం సాధ్యమేనా అని ఎమ్మెల్యే, స్థానిక అధికారులు ప్రశ్నించుకుంటున్నారు. తమకు శాశ్వత ఇళ్లు నిర్మించుకోవటానికి బ్యాంకుల నుండి సబ్సిడీపై లోను ఇప్పిస్తే తమ తిప్పలు తాము పడుతామని స్థానికులు సలహా ఇస్తున్నారు.
A Report By
Pittala Rajender
Sr.Journalist, Godavarikhani