Thursday, 28 March 2013


సింగరేణిలో ప్రారంభమైన పించనర్ల ఉద్యమం


 సింగరేణి సంస్థలో కూడా పించనుదారుల ఉద్యమం ప్రారంభమైంది. ప్రభుత్వ పించనర్ల మాదిరిగా సింగరేణిలో రిటైరైన కార్మికులందరికీ ప్రస్తుత ధరలకు అనుగుణంగా పింఛను పెంచాలని వారు కోరుతున్నారు. నాలుగు జిల్లాల్లో వ్యాపించిఉన్న సింగరేణి బొగ్గు గనుల్లో ఒకప్పుడు లక్ష మందికి పైగా కార్మికులు పనిచేసేవారు. కాగా సంస్థలో యాజమాన్యం చేపట్టిన నూతన సాంకేతిక విధానాలు, యాంత్రీకరణల కారణంగా వేలాది మంది కార్మికులను 'గోల్డెన్‌ షేక్‌ హాండ్‌', 'వాలంటరీ రిటైర్‌మెంట్‌' అదే నూతన విధానాల పేరిట యాజమాన్యం ఉద్యోగం నుంచి విరమణ చేయించింది. ఏళ్ల తరబడి బొగ్గు గనుల్లో కష్టపడి పనిచేసి అలసిన కార్మికులు ఈ పథకాల పట్ల ఆకర్శితులైనారు. అనారోగ్యపాలైన కార్మికులు, ఇక గనుల్లో అంతగా పనిచేయలేని కార్మికులు ఈ పథకాల కింద రిటైరైనారు. వీరు పదవీవిరమణ చేసిన సమయంలో వచ్చిన డబ్బులు మినహా, కార్మికులకు పింఛను సౌకర్యం లేదు. ఆ తర్వాత వేజిబోర్డు విధానాల్లో మార్పులు వచ్చిన కారణంగా, సింగరేణిలో అమలుచేస్తున్న పింఛను విధానానికి, ప్రభుత్వ పింఛను విధానానికి ఎంతో వ్యత్యాసం కనిపిస్తున్నది. ప్రభుత్వ పింఛను నెలకు కనీసం ఐదు వేల రూపాయలుండగా, సింగరేణి పింఛను మూడువందల రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారు. 'పింఛను' నిర్ణయించడంలో ప్రభుత్వ విధానాలను విడనాడి సింగరేణిలో ప్రత్యేక విధానాన్ని అనుసరిస్తున్నారు.
ఇందువల్ల సింగరేణి కార్మికులు ఉద్యోగం నుండి రిటైరైన తర్వాత చాలా కష్టాలు అనుభవిస్తున్నారు. ఒకప్పుడు సింగరేణిలో పనిచేసిన కార్మికులు దర్జాగా నివసించేవారు, కాగా ఇప్పుడు ఉద్యోగాల నుండి రిటైరై పింఛనుదారులుగా మారినవారు హోటళ్లలో, రైస్‌ మిల్లులలో, విద్యాసంస్థలలో వాచ్‌మెన్‌లుగా, తోటమాలీలుగా పనిచేస్తూ దుర్భర జీవితాలను గడుపుతున్నారు. నెల నెలా సింగరేణిలో లభించే పింఛను వేయి నుంచి మూడువేల రూపాయలు వస్తున్నాయి. ఇందువల్ల రిటైరైన కార్మికులు తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకున్నారు. కొన్ని కుటుంబాలు రోజుకు కడుపునిండా తిండికి కూడా నోచుకోని పరిస్థితుల్లో కొనసాగుతున్నారు. 

పదేళ్ల కిందట రిటైరైన కార్మికులందరికీ నెలకు రెండు నుండి మూడు వేల రూపాయల పింఛను లభిస్తుండగా, రెండేళ్ల నుంచి రిటైరైన కార్మికులకు నెలకు ఐదు నుండి ఆరువేల రూపాయలు పింఛను లభిస్తున్నది. సింగరేణిలో కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పింఛనర్ల మాదిరిగానే పింఛను పథకం అమలు చేయాలని రిటైరైన కార్మికులు కోరుతున్నారు. ఈ మేరకు గోదావరిఖని కేంద్రంగా రిటైరైన కార్మికుల పింఛను ఉద్యమం సోమవారం ప్రారంభమైంది. కోల్‌మైన్స్‌ పెన్షనర్స్‌, అసోసియేషన్‌, సీనియర్‌ సిటిజన్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ అనే రెండు సంస్థలు సంయుక్తంగా ఒక సదస్సును నిర్వహించి పింఛనర్ల సమస్యలను వెలుగులోకి తెచ్చాయి. ఈ అసోసియేషన్లు సింగరేణి యాజమాన్యానికి కొన్ని సూచనలను, ప్రతిపాదనలను సమర్పించాయి. బొగ్గు గనుల్లో ప్రస్తుతం పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులందరికీ (ఔట్‌సోర్సింగ్‌) సి.ఎం.పి.ఎఫ్‌ అమలు పరచాలని, నేషనల్‌ కోల్‌వేజ్‌ అగ్రిమెంటులో కోల్‌మైన్స్‌ వర్కర్స్‌ మినిమం పెన్షను నెలకు కనీసం ఐదువేల రూపాయలకు తగ్గకుండా ఒక నియమాన్ని రూపొందించాలని, ఇప్పటికే అన్యాయం జరిగిన రిటైర్డు కార్మికులందరికీ ప్రస్తుత పింఛనును సవరించి వృద్ధి చేయాలని సంఘాలు విజ్ఞప్తి చేశాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతోనూ, సింగరేణి యాజమాన్యంతోనూ చర్చలు జరపాలని తీర్మానించాయి. సింగరేణిలోని అన్ని కార్మిక సంఘాలు కూడా తమ సమస్యల పరిష్కారానికి చేయూతనిచ్చి సహాయం చేయాలని ఈ సంఘాలు విజ్ఞప్తి చేశాయి. త్వరలోనే సింగరేణి బొగ్గు గనులున్న అన్ని డివిజన్లలో రిటైరైన కార్మికులతో సదస్సులు నిర్వహించి పింఛను అవగాహనను పెంచడానికి ప్రయత్నిస్తున్నట్లు సంఘాల నాయకులు సింగరేణి మాజీ జీ.ఎం. కే.ఆర్‌.సి.రెడ్డి, జి.చందర్‌రావు, తిరుమల రాయప్ప వివరించారు. వేలాది మంది సింగరేణి పింఛనుదారులు తమ భవిష్యత్తు బాగుపడుతుందన్న ఆశతో నిరీక్షిస్తున్నారు.