నడిమెట్ల ధర్మెందర్‌కు 'ఏకవీర' పురస్కారం
వివిధ ప్రాంతాల, భాషలకు సంబంధించిన వార్తా పత్రికలను సేకరించినందుకు గాను గోదావరిఖనికి చెందిన నడిమెట్ల ధర్మెందర్‌కు అరుదైన గౌరవం దక్కింది. తేది 12-12-12కు చెందిన దేశంలోని 24 రాష్ట్రాలతో పాటు, 15 దేశాలకు చెందిన వివిధ భాషలలో ప్రచురితమైన 999 పత్రికలను సేకరించి ప్రదర్శించినందుకు గాను ధర్మెందర్‌కు 'ఏకవీర' పురస్కారాన్ని ప్రధానం చేస్తున్నట్లు 'బుక్ ఆఫ్ స్టేట్ రికార్డ్స్' ప్రకటించింది. గతంలో మహారాష్ట్రలోని కళ్యాన్ ప్రాంతానికి చెందిన సహస్రబుదో 11-11-11వ తేదీన ప్రచురితమైన 21 భాషలకు చెందిన 360 దినపత్రికలను సేకరించి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించగా ఆయన్ను ఆదర్శంగా తీసుకున్న ధర్మెందర్ ఐదు నెలలు శ్రమించి 999 పత్రికలు సేకరించారు. ఈ పత్రికల ప్రదర్శన వివరాలను లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్సుతో పాటు విజయవాడ కేంద్రంగా రికార్డులు పరిశీలించే బుక్ ఆప్ స్టేట్ రికార్డ్స్‌కు పంపించారు. ఈ వివరాలను పరిశీలించిన స్టేట్ బక్ ఆప్ రికార్డ్స్ ధర్మెందర్ ఈ విషయంలో ప్రపంచ రికార్డును అధిగమించినట్లు ప్రకటించింది. దీంతో పాటు ధర్మెందర్‌కు 'ఏకవీర' పురస్కారాన్ని అందజేస్తున్నట్లు సంస్థ ప్రధాన సంపాదకులు చిరంజీవివర్మ తెలుపుతూ ధృవీకరణ పత్రాన్ని జారీ చేశారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి చెందిన నడిమెట్ల ధర్మెందర్ ఈ అరుదైన రికార్డును సాధించడంతో జేసీఐ సభ్యులు, లయన్స్ క్లబ్, రామకృష్ణ సేవా సమితి, జిపిపిపిపిజికి చెందిన సభులతో పాటు పలువురు ఆయనను అభినందించారు.