Thursday, 28 March 2013
సింగరేణిలో ప్రారంభమైన పించనర్ల ఉద్యమం
సింగరేణి సంస్థలో కూడా పించనుదారుల ఉద్యమం ప్రారంభమైంది. ప్రభుత్వ పించనర్ల మాదిరిగా సింగరేణిలో రిటైరైన కార్మికులందరికీ ప్రస్తుత ధరలకు అనుగుణంగా పింఛను పెంచాలని వారు కోరుతున్నారు. నాలుగు జిల్లాల్లో వ్యాపించిఉన్న సింగరేణి బొగ్గు గనుల్లో ఒకప్పుడు లక్ష మందికి పైగా కార్మికులు పనిచేసేవారు. కాగా సంస్థలో యాజమాన్యం చేపట్టిన నూతన సాంకేతిక విధానాలు, యాంత్రీకరణల కారణంగా వేలాది మంది కార్మికులను 'గోల్డెన్ షేక్ హాండ్', 'వాలంటరీ రిటైర్‌మెంట్' అదే నూతన విధానాల పేరిట యాజమాన్యం ఉద్యోగం నుంచి విరమణ చేయించింది. ఏళ్ల తరబడి బొగ్గు గనుల్లో కష్టపడి పనిచేసి అలసిన కార్మికులు ఈ పథకాల పట్ల ఆకర్శితులైనారు. అనారోగ్యపాలైన కార్మికులు, ఇక గనుల్లో అంతగా పనిచేయలేని కార్మికులు ఈ పథకాల కింద రిటైరైనారు. వీరు పదవీవిరమణ చేసిన సమయంలో వచ్చిన డబ్బులు మినహా, కార్మికులకు పింఛను సౌకర్యం లేదు. ఆ తర్వాత వేజిబోర్డు విధానాల్లో మార్పులు వచ్చిన కారణంగా, సింగరేణిలో అమలుచేస్తున్న పింఛను విధానానికి, ప్రభుత్వ పింఛను విధానానికి ఎంతో వ్యత్యాసం కనిపిస్తున్నది. ప్రభుత్వ పింఛను నెలకు కనీసం ఐదు వేల రూపాయలుండగా, సింగరేణి పింఛను మూడువందల రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారు. 'పింఛను' నిర్ణయించడంలో ప్రభుత్వ విధానాలను విడనాడి సింగరేణిలో ప్రత్యేక విధానాన్ని అనుసరిస్తున్నారు.
Sunday, 17 March 2013
'బి-థర్మల్' విద్యుత్ కేంద్రం విస్తరణ డిమాండ్
అఖిల పక్ష నేతల 72 గంటల నిరాహార దీక్ష
బీ-థర్మల్ విద్యుత్ కేంద్ర విస్తరణ కోరుతూ అఖిలపక్ష పోరాట సమితి ఆధ్వర్యంలో స్థానిక బి పవర్‌హౌజ్ బైపాస్ రోడ్డు రాజీవ్ రహదారి పక్కన 72గంటల నిరవధిక నిరాహార దీక్షను చేపట్టారు. ఈ దీక్షలో టీఆర్‌ఎస్, టీడీపీ, సీపీఐఎంఎల్ న్యూడెమాక్రసీ, సీపీఐ, సీపీఎం, బీజేపీ, వైసీపీ, కాంగ్రేస్‌కు చెందిన కన్వినర్ కన్నూరి సతీష్‌కుమార్, లగిశెట్టి భీమన్న, తూళ్ల రాజేశ్, ఎండి.సాజిద్, పర్కాల లక్ష్మణ్, గీట్ల లక్ష్మారెడ్డి, కొమ్ము రాజమల్లు యాదవ్, బొడ్డుపల్లి శ్రీనివాస్, మార్త రామన్న, మోసం సదా, దూలం సతీశ్, నంది నారాయణ, ఉమా మహేశ్వర్, పెండ్యాల సతీశ్, వేల్పుల రవీందర్, షేక్ అఫ్జల్ పాషా, హీరాసింగ్‌లు కూర్చోగా, ముఖ్యఅతిథులుగా హాజరై జెన్‌కో ఎస్‌ఈ నర్సింహారావు, నాయకులు కోడిపుంజుల రాజన్న, మాతంగి శ్రీనివాస్, బొడకుంట జనార్ధన్, కొంకటి లక్ష్మినారాయణ, మాతంగి నర్సయ్య, ఉరిమెట్ల రాజలింగం, బుర్ర తిరుపతి, ఎం.రామాచారి, ఆవుల గోపాల్‌యాదవ్, నరేష్, గోపు అయిలయ్య యాదవ్, దీటి బాలరాజు, హైమద్ బాబు, పద్మనాభరావులు పూలమాల వేసి దీక్షను ప్రారంభించారు. కాగా వివిధ సంఘాల, పార్టీల నాయకులు, స్థానికులు వీరికి సంఘీభావం తెలిపారు. గతంలో 'రామగుండం టుడే' బ్లాగ్‌లో రామగుండం బి-థర్మల్ విస్తరణపై ప్రత్యేక వ్యాసాన్ని పోస్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన వివరాల కోసం ఓల్డ్ పోస్ట్‌లను చదవండి.
Saturday, 16 March 2013
గ్రూప్-2 విజేత ఇమామ్‌బాబా
అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్‌గా 'ఖని' యువకుడు
Shaik Imam baba |
గోదావరిఖని రమేష్‌నగర్‌కు చెందిన షేక్ ఇమామ్ బాబా ఎపీపీఎస్సీ ఇటీవల ప్రకటించిన గ్రూప్-2 ఫలితాల్లో సహాయ వాణిజ్య పన్నుల అధికారిగా ఎంపికయ్యాడు. ఇమామ్‌బాబా పదవ తరగతి వరకు స్థానిక వాసవ్య విద్యాలయంలో, ఇంటర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివాడు. బయోకెమిస్ట్రీలో పోస్టుగ్రాడ్యుయేషన్ వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయంలో పూర్తిచేశాడు. పీహెచ్‌డీ చేసేందుకు పరిశోధక విద్యార్ధిగా కూడా ఎంపికయ్యాడు. అటు ఉన్నత విద్యను కొనసాగిస్తూనే ఇటు పోటీ పరీక్షలకు ప్రయత్నాలు చేశాడు. ఈనెల 11న కమీషన్ విడుదల చేసిన గ్రూప్-2 ఫలితాలలో ఇమామ్‌బాబా ఎంపికైనట్లు పేర్కొన్నారు. వచ్చే వారంలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ అనంతరం ఆయనకు నియామక ఉత్తర్వులు అందజేస్తారు. ఇమామ్‌బాబా అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్‌గా ఎంపిక కావడంపై కుటుంబ సభ్యులు, రమేష్‌నగర్ వాసులు, వాసవ్య విద్యాలయం ఉపాధ్యాయ బృందం హర్షం వ్యక్తం చేశారు.
Thursday, 14 March 2013
మానవత్వం పరిమళించె...
వికలాంగ మిత్రునికి ఆర్థిక సహాయం
వికలాంగుడైన మిత్రునికి చిన్ననాటి స్నేహితులు ఆర్థిక సహాయం చేసి ఆదుకున్నారు. రామగుండ పట్టణానికి చెందిన కనుకుంట్ల శ్రీనివాస్‌కు ప్రమాదవశాత్తు రెండు చేతులు తెగిపోయాయి. ఆర్థికంగా కొద్ది రోజులుగా బాధపడుతున్నాడు. దీంతో అతనితో పదో తరగతి చదువుకున్న 1985-86 బ్యాచ్ విద్యార్ధులు రూ.11,500 జమ చేశారు. ఆ మొత్తాన్ని బుధవారం ఆయనకు అందజేశారు. శ్రీనివాస్‌ను ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరారు. సాయం చేసిన వారిలో దయానర్సింగ్, రియాజొద్దీన్, మజారోద్దీన్, అంజయ్య, సుందిల్ల వెంకటస్వామి, రాజు, ఇసంపల్లి తిరుపతి ఉన్నారు. అందుకే అన్నారు.. 'ప్రార్ధించే చేతుల కన్నా.. సేవ చేసే చేతులు మిన్న'
Wednesday, 13 March 2013
రామగుండం సమస్యలు ఇవే.. అధ్యక్షా..
నేటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
- తాగు నీరు లేక అల్లాడుతున్న జనం
- బాబ్లీతో రైతులకు సాగునీటి గండం
- కరెంటు కోతలతో వెలుగుల నగరంలో అంధకారం
- విద్యుత్ ప్రాజెక్టుల విస్తరణకు మోక్షం కలిగించండి
- రాజీవ్ రహదారి విస్తరణలో నాన్యతా లోపాలు
- మెడికల్, ఇంజనీరింగ్ ప్రభుత్వ కళాశాలలు ఏర్పాటు చేయండి
- ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేయండి.
- ఓపెన్‌కాస్టులతో బొందల గడ్డగా మారుతున్న రామగుండం పరిసరాలు
- ఉద్యోగాల కల్పన లేక వలస వెళుతున్న యువత
ఇంకా ఎన్నో.. మరెన్నో.. కొన్నింటినైనా పరిష్కరించండి.. అధ్యక్షా..
Tuesday, 12 March 2013
Slum-Free City Plan for RAMAGUNDAM
రామగుండం గృహ నిర్మాణ పథకంపై స్థానికుల వ్యతిరేకత
Sunday, 10 March 2013
మహిమాన్విత జనగామ శివాలయం
పునరుద్దరణలో పాలకుల నిర్లక్ష్యంరామగుండం పారిశ్రామిక ప్రాంతంలో చారిత్రక ప్రాధాన్యం ఉన్నటువంటి జనగామ రాజరాజేశ్వర దేవాలయం పాలకుల నిర్లక్ష్యానికి గురైంది. తెలంగాణ ప్రాంతంలో ఆదరణ కోల్పోయిన అనేక చారిత్రక కట్టడాల్లో ఒకటైన జనగామ శివాలయం నేడు శిథిలావస్థకు చేరుకుంది. ఎంతో మహిమ గల ఇక్కడి శివలింగాన్ని దర్శించుకోవడానికి అనేక మంది భక్తులు రోజూ ఇక్కడికి వస్తూ ఉంటారు. శారీరక, మానసిక, ఆర్ధిక ఇబ్బందులతో సతమతమయ్యే అనేక మంది ఇక్కడి శివ లింగాన్ని దర్శించుకుని ఉపశమనాన్ని పొందుతారు. ఇక్కడి శివాలయ నిర్మాణంలో అద్భుత కళాఖండాలు ఉన్నాయి. ప్రభుత్వ నిరాదరణ వల్ల అవి శిథిలమవుతున్నాయి. హిందూ పర్వదినాలలో ఈ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. ఇక్కడి వచ్చిన భక్తులు ఆలయ దుస్థితిని
నేడు మహా శివరాత్రి
శివరాత్రికి ముస్తాబయిన స్థానిక శైవక్షేత్రాలు
రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో మహాశివరాత్రి వేడుకలకు శివక్షేత్రాలు ముస్తాబయ్యాయి. భక్తుల సౌకర్యం కోసం బారికేడ్లు నిర్మించడంతో పాటు, ప్రత్యేక పూజలకు ఏర్పాట్లు చేశారు. కోల్‌బెల్ట్ ప్రాంతంలోని అతి పురాతనమైన జనగామ త్రిలింగేశ్వర ఆలయంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా మండపాలు నిర్మించడంతో పాటు గోదావరి నది వద్ద స్నానాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఉదయం నుంచి అభిషేకాలు, అర్చనలతో పాటు సాయంత్రం శివ కళ్యాణానికి ఆలయ ఆవరణలో పందిర్లు నిర్మించారు. పట్టణంలోని పవర్‌హౌజ్ కాలనీ శివాలయం, కోదండరామాలయంలోని శివాలయం, మార్కండేయ కాలనీ శివాలయం, వీరభ్రహ్మేంధ్రస్వామి ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శనివారం సాయంత్రం నుంచే కోల్‌బెల్ట్‌లో పండుగ శోభ సంతరించుకుంది. మహాశివరాత్రి ప్రత్యేక పూజలకు అవసరమైన సామాగ్రి కొనుగోలు చేసేందుకు శివాజీనగర్‌లో ఏర్పాట్లు చేసిన ప్రత్యేక దుకాణాల వద్ద భక్తుల తాకిడి పెరిగింది. దీపాలు, పూలు, పండ్లు ఇతర సామాగ్రి కొనుగోలు చేసేందుకు బారులు తీరారు.
శివరాత్రి ప్రత్యేక కార్యక్రమాలు
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని
Saturday, 9 March 2013
రామగుండం కార్పోరేషన్‌లో తాగునీటికి రూ.60 లక్షల నిధులు
ఎండాకాలంలో తాగునీటి ఎద్దడి తీర్చేందుకు ప్రత్యామ్నాయ చర్యల్లో భాగంగా రూ.60లక్షల నిధులు కేటాయిస్తున్నట్లు పెద్దపల్లి ఎంపీ వివేక్ తెలిపారు. రామగుండం కార్పోరేషన్ పరిధిలోని ప్రజల తాగునీటి సమస్యను తొలగించడానికి శుక్రవారం కార్పోరేషన్‌లో ఎంపీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆ నిధులతో గోదావరినది వద్ద కొత్తగా 15 బోర్లు వేయాలని, ప్రస్తుతం పనిచేయని బోర్లకు మరమ్మత్తు చేయించాలని అధికారులకు సూచించారు. నగరవాసులకు రోజు విడిచి రోజు తాగునీటిని సరఫరా చేయాలని అదేశించారు. తాగునీటి సమస్యను శాశ్వత పరిష్కారాలనికి ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి పైపులైను కోసం చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. రాజీవ్ రహదారి విస్తరణ పనులలో దెబ్బతిన్న ప్రధాన పైపులైను నిర్మాణానికి రూ.12కోట్లతో అంచనాలు రూపొందించామని, దీనిపై రోడ్లు భవనాల శాఖ ఆమోదం కోసం కృషిచేస్తామన్నారు. లేదంటే స్థానికులు ఆందోళన తీవ్రతరం చేస్తారని, అవసరమైతే తాను సైతం ఆందోళనలో పాల్గొంటానన్నారు. సింగరేణి క్రమబద్దీకరించిన స్థలాల్లో గృహాల నిర్మాణాలతో పాటు పేరు మార్పిడి సులభతరం చేయాలని బల్దియా అధికారులను కోరారు.Friday, 8 March 2013
దీపం కిందే చీకటి
రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఎడాపెడా కరెంటు కోతలు
కరెంటుకు పుట్టినిల్లుగా పేరుగాంచిన రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోనే కరెంటు కోతలు విచ్చలవిడిగా కొనసాగిస్తున్నారు. వేసవి ఎండలు రాకముందే ఎడాపెడా కరెంటు కోతలు విధించడం వల్ల స్థానికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో నిర్ణీత వేళల్లో కరెంటు కోత విధించేవారు. కాగా ఇటీవలి కాలంలో కరెంటు కోతలకు ఒక వేళా, పాళా లేకుండా చిత్తం వచ్చినట్లు కోత విధిస్తున్నారు. ఇంటర్, ఎస్‌ఎస్‌సి, వార్షిక పరీక్షలకు సిద్దమవుతున్న వందలాది మంది విద్యార్ధులు కరెంటు కోతల కారణంగా తమ చదువును కొనసాగించటం కష్టంగా మారింది. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో (ఎన్టీపీసీ) జాతీయ విద్యుత్ సంస్థ 2600 మెగావాట్ల సామర్ధ్యం గల థర్మల్ విద్యుత్ యూనిట్లను నెలకొల్పింది. ఇందులో 200 మెగావాట్ల సామర్ధ్యం గల మూడు యూనిట్లు, 500 మెగావాట్ల సామర్ధ్యం గల నాలుగు యూనిట్లు విద్యుత్ ఉత్పత్తిని కొనసాగిస్తున్నాయి. ఈ యూనిట్ల ద్వారా ప్రతీ రోజూ సుమారు 60 మిలియన్ యూనిట్ల విద్యుత్ దక్షిణాది రాష్ట్రాలకు పంపిణీ చేస్తున్నారు. మన రాష్ట్రానికి ప్రతీరోజూ రామగుండం, ఎన్టీపీసీ సూపర్ థర్మల్ కేంద్రం నుంచి 27శాతం విద్యుత్ లభిస్తుంది. ఈ మేరకు ప్రతీ రోజూ సుమారు 700 మెగావాట్ల విద్యుత్‌ను కేటాయిస్తుంటారు. మన రాష్ట్రానికి వచ్చే వాటాతో పాటు ఎన్టీపీసీ ఆధీనంలో ఉండే 15శాతం కోటా సుమారు తొమ్మిది మిలియన్ యూనిట్ల నుండి కూడా మన రాష్ట్రం అత్యవసర పరిస్థితుల్లో అడిగి వినియోగించుకునే అవకాశం ఉంది. ఎన్టీపీసీతో పాటు రామగుండం ప్రాంతంలో రాష్ట్ర విద్యుత్ బోర్డుకు చెందిన 62.5మెగావాట్ల సామర్ధ్యం గల థర్మల్ విద్యుత్ కేంద్రం విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నది.
Sunday, 3 March 2013
నేడు సింగరేణి ఆస్పత్రిలో సి.టి.స్కాన్ ప్రారంభం
గోదావరిఖని: స్థానిక సింగరేణి ఏరియా ఆస్పత్రిలో రూ.2.7కోట్లతో నెలకొల్పిన సి.టి.స్కాన్‌ను ఆదివారం సింగరేణి సీఎండి ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. కొన్ని నెలల క్రితం సింగరేణి ఏరియా ఆస్పత్రిలో నెలకొల్పిన సి.టి.స్కాన్ ఇప్పటికే ఉపయోగంలోకి తీసుకువచ్చారు. కాగా నేడు అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ యంత్రంతో కిడ్నీలో ఏర్పడే రాళ్లు, పేగు కాన్సర్‌కు సంబంధించిన నిర్ధారణ, గర్భసంచిలో గడ్డలు, కడుపు నొప్పి నిర్ధారణ చేసి చికిత్స పొందే అవకాశముంటుంది. సి.టి.స్కాన్‌తో రామగుండం రీజియన్‌లో ఉన్న 22వేల మంది కార్మికులు, వారి కుటుంబీకులకు ఉపయోగపడుతుందని వైద్యులు చెప్పారు.
Saturday, 2 March 2013
Cultural Fest-2013
గోదావరిఖని: స్థానిక గాంధీనగర్‌లోని 'గీతాంజలి హైస్కూల్' నందు శనివారం 'కల్చరల్ ఫెస్ట్-2013' పేరిట సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్ధులు ప్రదర్శించిన పలు కళారూపాలు ప్రేక్షకులను అలరించాయి. లేటెస్ట్ పాటల నృత్యాలతో పాటు.. చారిత్రక మహాభారతం, రామాయణంలకు సంబంధించిన నాటికలు, పాటల నృత్య రూపాలు అబ్బురపరిచాయి. సాయంత్రం వరకు కొనసాగిన ఈ కార్యక్రమంలో పలు రకాల ప్రదర్శనలు విద్యార్ధులు ప్రదర్శించారు. వివిధ విభాగాలలో ప్రతిభ కనబరిచిన విద్యార్ధులను పాఠశాల కరస్పాండెంట్ కంది రవీందర్‌రెడ్డి అభినందించారు. పాశ్చాత్య నృత్యాలకు మక్కువ చూపుతున్న ఈ రోజుల్లో పురాణ గాథల నుండి విషయాలను ప్రదర్శనలకు తీసుకోవడం పట్ల పలువురు అతిథులు, పోషకులు నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో స్థానికులు, పోషకులు, ఉపాధ్యాయులు, విద్యార్ధులు పాల్గొన్నారు.
'బాబ్లీ'తో మరింత పెరగనున్న నీటి కష్టాలు
బాబ్లీ ప్రాజెక్టు అనుమతితో ఉత్తర తెలంగాణ ఇక ఎడారిగా మారే ప్రమాదముంది. గోదావరి నది ఎగువభాగంలో మహారాష్ట్రలో బాబ్లీతో పాటు మరో 11 ప్రాజెక్టుల నిర్మాణం వల్ల ఉత్తర తెలంగాణకు చుక్క నీరు కూడా వచ్చే అవకాశం లేదు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల అసమర్ధత ఇక్కడి ప్రజలకు శాపంగా మారింది. రాష్ట్రంలో పాలనసాగిస్తున్న సీమాంధ్ర ప్రభుత్వం బలంగా వాదించకపోవడం వల్లే బాబ్లీకి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చిందని స్థానిక నాయకులు విమర్శిస్తున్నారు. ఉత్తర తెలంగాణ వరదాయని అయిన శ్రీరంసాగర్ ప్రాజెక్టు ద్వారా 18లక్షల ఎకరాల ఆయకట్టుకు తెలంగాణలో సాగునీరందాల్సి ఉండగా బాబ్లీతో భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారింది. అలాగే తెలంగాణలో తాగునీటి సమస్య కూడా తీవ్ర రూపం దాల్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే రామగుండం కార్పోరేషన్ ప్రాంతంలో రోజు విడిచి రోజు మంచినీటి సరఫరా అవుతుండగా రాబోవు వేసవిలో వారం రోజులకు ఒకసారి కూడా తాగునీటి సరఫరా చేసే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికే గోదావరి నది ఎడారిని తలపిస్తోంది.
Friday, 1 March 2013
ప్రత్యేక తెలంగాణ పోరాటంలో గోదావరిఖని జర్నలిస్టులు
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకై జరుగుతున్న ఉద్యమంలో గోదావరిఖని పాత్రికేయులు కూడా ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. గోదావరిఖని ప్రెస్‌క్లబ్, తెలంగాణ జర్నలిస్టుల ఫోరం సంయుక్తంగా నిర్వహిస్తున్న దీక్షలు, ర్యాలీలు, తెలంగాణ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయడానికి తోడ్పడుతున్నాయి. తెలంగాణ జిల్లాల్లో ప్రప్రథమంగా గోదావరిఖని ప్రెస్‌క్లబ్ సభ్యులు రిలేనిరాహార దీక్షలు ప్రారంభించి ఉద్యమానికి ఊపిరి అందించారు. ప్రతీ ఏడాది జనవరి నెలలో నూతన సంవత్సర ఆరంభ తేదీ నుండి వారం రోజుల పాటు గోదావరిఖని చౌరస్తాలో రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తూ ఇతర పార్టీలకు, కార్మిక సంఘాలకు, ప్రజా సంఘాలకు స్ఫూర్తి కలిగిస్తున్నారు. ఈ ఏడాది కూడా జనవరి నెలలో ర్యాలీలు, పోరు దీక్షలు నిర్వహించి పాత్రికేయులు రామగుండం పారిశ్రామిక ప్రాంతమంతటా సంచలనం సృష్టించారు. ఈ కార్యక్రమంలో అన్ని పార్టీల, కార్మిక, ఉద్యోగ, యువజన, విద్యార్ధి, మహిళా సంఘాల నేతలు, కార్యకర్తలు, స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చి దీక్షలకు సంఘీభావం ప్రకటించారు. పాత్రికేయులు తాము స్వంతంగా ఇచ్చిన విరాళాలతోనే ఈ ఉద్యమాన్ని కొనసాగించటం పట్ల పలువురు ప్రశంసిస్తున్నారు.
డిస్మిస్ కార్మికుల ఉపాధికై సింగరేణిలో మరో ఐక్యపోరాటం
సింగరేణి బొగ్గు గనుల్లో పనిచేస్తూ తొలగింపు(డిస్మిస్)కు గురైన కార్మికులందరినీ తిరిగి ఉద్యోగాల్లో చేర్చుకోవాలని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాలన్నీ సరికొత్త ఉద్యమానికి సిద్దపడుతున్నాయి. ఐఎన్‌టీయూసీ, హెచ్‌ఎంఎస్, బిఎంఎస్ వంటి జాతీయ సంఘాలతో పాటు వివిధ రాజకీయ పార్టీలకు అనుబంధ:గా ఉన్న కార్మిక సంఘాల నేతలు గోదావరిఖనిలో ఈమేరకు ఒక రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించాయి. తొలగించిన గని కార్మికులందరినీ సింగరేణి యాజమాన్యం తిరిగి ఉద్యోగాల్లో తీసుకోవాలని, ఇందులో ఏమాత్రం జాప్యం చేసినా, సింగరేణి బొగ్గుగనులన్నీ అన్ని జిల్లాల్లో ఐక్యపోరాటాలు కొనసాగిస్తామని ఈ సంఘాల నాయకులు హెచ్చరించారు.
వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో, విభాగాల్లో పనిచేయటానికి, బొగ్గు గనుల్లో పనిచేయటానికి మధ్యగల భారీ వ్యత్యాసాన్ని ప్రభుత్వంగానీ, యాజమాన్యం గానీ సరిగ్గా పట్టించుకోవటం లేదని పలువురు విమర్శిస్తున్నారు. భూగర్భం లోపల చీకటి గనుల్లోని సొరంగాల్లో తగినంత గాలి, వెలుతురు లేని చోట్ల ప్రాణాలకు తెగించి పుట్టెడు కష్టాలు పడే గని కార్మికుల పరిస్థితులను పాలకులెవ్వరూ సరిగ్గా అర్ధం చేసుకోవడం లేదు. ఊపిరాడటం కష్టంగా ఉండే లోతైన పని స్థలాల్లో పై కప్పులు ఎప్పుడు కూలిపోతాయో తెలియని ప్రమాదకర పరిస్థితుల్లో గని కార్మికులు చిన్న హెడ్‌లైట్ సహాయంతో బొగ్గు తట్టలు మోయటం, పదునుగా, జారిపోయే విధంగా ఉండే అడుగు భాగాల మీదుగా లాడీసుల(బొగ్గు టబ్బుల) వరకు వేగంగా బొగ్గు తట్టలు మోయటం చాలా కష్టంగా ఉంటుంది. కార్మికులు తమ రక్తాన్ని చెమటగా మార్చుకుంటూ మూడు షిఫ్టుల్లో బొగ్గును ఉత్పత్తి చేసి గని ఉపరితలానికి పంపిస్తారు.
కోల్‌బెల్ట్ రూటు పట్ల రైల్వే నిర్లక్ష్యం
కోల్‌బెల్ట్ ప్రాంతాల్లోని ప్రయాణీకుల పట్ల రైల్వేశాఖ మరోమారు తన నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది. గత దశాబ్దకాలంగా రైలు సౌకర్యాలు మెరుగుపరచాలని, కొత్త రైళ్లు ప్రవేశపెట్టాలని ఈ ప్రాంతంలోని లక్షలాది మంది ప్రయాణీకులు, ప్రజాప్రతినిధులు చేస్తున్న విజ్ఞప్తులను రైల్వే శాఖ అధికారులు, మంత్రులు ఏమాత్రం పట్టించుకోలేదు. మంగళవారం నాడు రైల్వేమంత్రి పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన 2013-14 రైల్వే వార్షిక బడ్జెట్‌లో తెలంగాణ ప్రాంత ప్రయాణీకుల పట్లగానీ, బొగ్గు గనులు వ్యాపించి ఉన్న కోల్‌బెల్ట్ ఏరియా ప్రయాణీకుల పట్ల గానీ ఎలాంటి కనికరం చూపించలేదు. రామగుండం-మణుగూరుల మధ్య నూతన రైల్వేలైను ప్రతిపాదన గత పదేళ్లకాలం నుండి సర్వే పేరిట పెండింగ్‌లో పెట్టారు. ఈ ఏడాది బడ్జెట్‌లో లక్ష రూపాయలు సర్వే కోసం కేటాయిస్తున్నట్లు పేర్కొన్నప్పటికీ, వాస్తవంగా సర్వే అమలులోకి వచ్చే అవకాశాలేమీ ఉండవని మరోమారు స్పష్టమైంది. అదిలాబాద్ జిల్లా బెల్లంపెల్లి నుండి ఖమ్మం జిల్లా కొత్తగూడెం వరకు వ్యాపించి ఉన్న కోల్‌బెల్ట్ రైల్వే రూటులో ప్రతినిత్యం వేలాది మంది ప్రయాణీకులు రైలుపై ఆధారపడి ప్రయాణిస్తుంటారు.
రామగుండం కార్పోరేషన్‌లో...
ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుపై నిర్లక్ష్యం
- -పారిశ్రామిక ప్రాంతంపై ప్రభుత్వ వివక్ష
- -ప్రజల సమస్యలు పట్టని ప్రజాప్రతినిధులు
Ramagundam Tahasildar Office |
రామగుండం పారిశ్రామిక ప్రాంతం ప్రత్యేక శ్రేణి మున్సిపాలిటీ నుంచి కార్పోరేషన్‌గా ఏర్పడి మూడు సంవత్సరాలు గడిచిపోయింది. అయినా ఇక్కడి ప్రజలకు ప్రభుత్వ కార్యాలయాలు అందుబాటులో లేకుండా పోవడం ఇక్కడి పాలకుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. రామగుండం కార్పోరేషన్ విస్తీర్ణపరంగా, జనాభా పరంగా జిల్లా కేంద్రానికి సమానమైంది. ఈ ప్రాంతంలోని సింగరేణి బొగ్గు గనుల నుండి, విద్యుత్ ఉత్పత్తి సంస్థల నుండి వేల కోట్ల రూపాయలు పన్నుల రూపంలో ప్రభుత్వ ఖజానాను నింపుతున్నా.. ఈ ప్రాంతంపై ప్రభుత్వానికి మొదటి నుంచి వివక్షే. ఇక్కడ ప్రజల సౌకర్యం కోసం ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేయించడంలో ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు, నాయకులు విఫలమవుతూనే ఉన్నారు. దాదాపు నాలుగు లక్షల జనాభా కలిగి, విద్యా, వాణిజ్య పరంగా అభివృద్ది చెందిన ఈ ప్రాంతంలో సబ్ ట్రెజరీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలంటూ దశాబ్దాలుగా డిమాండ్ ఉంది. గతంలో స్థానికంగా ఉన్న డీసీటీఓ కార్యాలయాన్ని ఇక్కడి నుంచి పెద్దపల్లికి తరలించారు. విద్యా, వ్యాపార సంస్థలు ప్రభుత్వ ఫీజులు, ఛలానాలు చెల్లించేందుకు స్థానికంగా ట్రెజరీ కార్యాలయం అందుబాటులో లేకపోవడంతో పెద్దపల్లికి వెళ్లాల్సి వస్తోంది. రామగుండం నియోజకవర్గంలో ఒకే తహసీల్దార్ కార్యాలయం ఉండడం వల్ల ప్రజల సరియైన సేవలు అందించలేకపోతున్నారు. లక్షల జనాభా ఉన్న ఈ ప్రాంతంలో కుల, ఆదాయ, నివాస తదితర ధృవీకరణ పత్రాలను జారీ చేయడమే ఆ కార్యాలయానికి గగనంగా మారుతోంది.
Subscribe to:
Posts (Atom)