Saturday 2 March 2013


'బాబ్లీ'తో మరింత పెరగనున్న నీటి కష్టాలు


బాబ్లీ ప్రాజెక్టు అనుమతితో ఉత్తర తెలంగాణ ఇక ఎడారిగా మారే ప్రమాదముంది. గోదావరి నది ఎగువభాగంలో మహారాష్ట్రలో బాబ్లీతో పాటు మరో 11 ప్రాజెక్టుల నిర్మాణం వల్ల ఉత్తర తెలంగాణకు చుక్క నీరు కూడా వచ్చే అవకాశం లేదు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల అసమర్ధత ఇక్కడి ప్రజలకు శాపంగా మారింది. రాష్ట్రంలో పాలనసాగిస్తున్న సీమాంధ్ర ప్రభుత్వం బలంగా వాదించకపోవడం వల్లే బాబ్లీకి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చిందని స్థానిక నాయకులు విమర్శిస్తున్నారు. ఉత్తర తెలంగాణ వరదాయని అయిన శ్రీరంసాగర్‌ ప్రాజెక్టు ద్వారా 18లక్షల ఎకరాల ఆయకట్టుకు తెలంగాణలో సాగునీరందాల్సి ఉండగా బాబ్లీతో భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారింది. అలాగే తెలంగాణలో తాగునీటి సమస్య కూడా తీవ్ర రూపం దాల్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే రామగుండం కార్పోరేషన్‌ ప్రాంతంలో రోజు విడిచి రోజు మంచినీటి సరఫరా అవుతుండగా రాబోవు వేసవిలో వారం రోజులకు ఒకసారి కూడా తాగునీటి సరఫరా చేసే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికే గోదావరి నది ఎడారిని తలపిస్తోంది. 


రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో మూడు లక్షలకు పైగా ఉన్న జనాభాకు ప్రస్తుతం 80లక్షల గ్యాలన్ల నీరు మాత్రమే లభిస్తోంది. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో, మండలానికి చెందిన పలు గ్రామాలకు గోదావరి నది నీరే దిక్కు. సింగరేణి, రామగుండం నగరపాలక సంస్థ, ఎన్టీపీసీ, ఏపీ జెన్‌కో సంస్థలు గోదావరినది వద్ద ఏర్పాటు చేసిన పంప్‌హౌజ్‌లన్నీ గాదావరి నీటిపైనే ఆధారపడి ఉండటంతో పైనుంచి నీటి ప్రవాహం తగ్గడంతో ఇన్‌ఫిల్ట్రేషన్‌ బావుల్లో నీటి సేకరణ సామర్ధ్యం తగ్గింది. తాగు నీటి సమస్య ఈ ఒక్కవేసవితో తీరిపోయేది కాదు. రానున్న కాలంలో ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఉంటుంది. ఎల్లంపల్లి వద్ద శ్రీపాద ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే కిందకు చుక్క నీరు కూడా వచ్చే పరిస్థితి ఉండదు. రామగుండం కార్పోరేషన్‌, సింగరేణి సంస్థలు చెరోక్క టీఎంసీ నీటి సరఫరా పూర్తిస్థాయిలో ఆమోదించుకొని పనులు చేపడితేనే భవిష్యత్తులో నీటి సమస్య రాకుండా ఉంటుంది.