Monday 15 April 2013


ఎన్టీపీసీ వద్ద ఎమ్మెల్యే మహాధర్నా


స్థానిక ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ నేతృత్వంలో టీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు, కార్యకర్తలు ఆదివారం సాయంత్రం ఎన్టీపీసీ జ్యోతినగర్‌లో మహాధర్నా నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు టీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్‌, వందలాది మంది కార్యకర్తలు, టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు. జ్యోతినగర్‌, గోదావరిఖనిల మధ్య ఉన్న ఖాళీ స్థలాన్ని మెడికల్‌ కాలేజీకి, ఐ.టి.పార్కుకు కేటాయించాలని ఎమ్మెల్యే డిమాండ్‌ చేశారు. నివాసాల మధ్య ఉన్న ఖాళీ స్థలాన్ని ఎన్టీపీసీ ప్రాజెక్టు అవసరాలకు గ్రామస్తులు నాలుగు దశాబ్దాల కిందట ధారాదత్తం చేశారని, ఈ స్థలంలో ఎన్టీపీసి యాజమాన్యం 25మెగావాట్ల సామర్ధ్యం గల సోలార్‌ పవర్‌ స్టేషన్‌ను ఏర్పాటు చేయటానికి సన్నహాలు చేస్తున్నదని ఎమ్మెల్యే వివరించారు. 

ఈ సోలార్‌ పవర్‌ స్టేషన్‌ వల్ల చుట్టుపక్కల గల కాలనీవాసులకు రేడియేషన్‌ ప్రభావం కలిగించే అవకాశం ఉందని ఆయన అన్నారు. ఎన్టీపీసీ రామగుండం ప్రాజెక్టు పరిధిలో వందలాది ఎకరాల ఖాళీ స్థలం అందుబాటులో ఉందని, అందువల్ల సోలార్‌ పవర్‌ స్టేషన్‌ వేరే స్థలంలో నిర్మించి, ప్రస్తుత స్థలాన్ని స్థానిక ప్రజల అవసరాలకు కేటాయించాలని ఎమ్మెల్యే కోరుతున్నారు. ఈ మేరకు ఆయన ఎన్టీపీసీ అధికారులకు, జిల్లా కలెక్టర్‌కు, రాష్ట్ర ముఖ్యమంత్రికి విజ్ఞప్తి పత్రాలు ఇచ్చినట్లు ఎమ్మెల్యే వివరించారు.

Thursday 4 April 2013


నడిమెట్ల ధర్మెందర్‌కు 'ఏకవీర' పురస్కారం

వివిధ ప్రాంతాల, భాషలకు సంబంధించిన వార్తా పత్రికలను సేకరించినందుకు గాను గోదావరిఖనికి చెందిన నడిమెట్ల ధర్మెందర్‌కు అరుదైన గౌరవం దక్కింది. తేది 12-12-12కు చెందిన దేశంలోని 24 రాష్ట్రాలతో పాటు, 15 దేశాలకు చెందిన వివిధ భాషలలో ప్రచురితమైన 999 పత్రికలను సేకరించి ప్రదర్శించినందుకు గాను ధర్మెందర్‌కు 'ఏకవీర' పురస్కారాన్ని ప్రధానం చేస్తున్నట్లు 'బుక్‌ ఆఫ్‌ స్టేట్‌ రికార్డ్స్‌' ప్రకటించింది. గతంలో మహారాష్ట్రలోని కళ్యాన్‌ ప్రాంతానికి చెందిన సహస్రబుదో 11-11-11వ తేదీన ప్రచురితమైన 21 భాషలకు చెందిన 360 దినపత్రికలను సేకరించి లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాదించగా ఆయన్ను ఆదర్శంగా తీసుకున్న ధర్మెందర్‌ ఐదు నెలలు శ్రమించి 999 పత్రికలు సేకరించారు. ఈ పత్రికల ప్రదర్శన వివరాలను లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్సుతో పాటు విజయవాడ కేంద్రంగా రికార్డులు పరిశీలించే బుక్‌ ఆప్‌ స్టేట్‌ రికార్డ్స్‌కు పంపించారు. ఈ వివరాలను పరిశీలించిన స్టేట్‌ బక్‌ ఆప్‌ రికార్డ్స్‌ ధర్మెందర్‌ ఈ విషయంలో ప్రపంచ రికార్డును అధిగమించినట్లు ప్రకటించింది. దీంతో పాటు ధర్మెందర్‌కు 'ఏకవీర' పురస్కారాన్ని అందజేస్తున్నట్లు సంస్థ ప్రధాన సంపాదకులు చిరంజీవివర్మ తెలుపుతూ ధృవీకరణ పత్రాన్ని జారీ చేశారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి చెందిన నడిమెట్ల ధర్మెందర్‌ ఈ అరుదైన రికార్డును సాధించడంతో జేసీఐ సభ్యులు, లయన్స్‌ క్లబ్‌, రామకృష్ణ సేవా సమితి, జిపిపిపిపిజికి చెందిన సభులతో పాటు పలువురు ఆయనను అభినందించారు.