Friday 1 March 2013


డిస్మిస్‌ కార్మికుల ఉపాధికై సింగరేణిలో మరో ఐక్యపోరాటం

సింగరేణి బొగ్గు గనుల్లో పనిచేస్తూ తొలగింపు(డిస్మిస్‌)కు గురైన కార్మికులందరినీ తిరిగి ఉద్యోగాల్లో చేర్చుకోవాలని డిమాండ్‌ చేస్తూ కార్మిక సంఘాలన్నీ సరికొత్త ఉద్యమానికి సిద్దపడుతున్నాయి. ఐఎన్‌టీయూసీ, హెచ్‌ఎంఎస్‌, బిఎంఎస్‌ వంటి జాతీయ సంఘాలతో పాటు వివిధ రాజకీయ పార్టీలకు అనుబంధ:గా ఉన్న కార్మిక సంఘాల నేతలు గోదావరిఖనిలో ఈమేరకు ఒక రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించాయి. తొలగించిన గని కార్మికులందరినీ సింగరేణి యాజమాన్యం తిరిగి ఉద్యోగాల్లో తీసుకోవాలని, ఇందులో ఏమాత్రం జాప్యం చేసినా, సింగరేణి బొగ్గుగనులన్నీ అన్ని జిల్లాల్లో ఐక్యపోరాటాలు కొనసాగిస్తామని ఈ సంఘాల నాయకులు హెచ్చరించారు. 
వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో, విభాగాల్లో పనిచేయటానికి, బొగ్గు గనుల్లో పనిచేయటానికి మధ్యగల భారీ వ్యత్యాసాన్ని ప్రభుత్వంగానీ, యాజమాన్యం గానీ సరిగ్గా పట్టించుకోవటం లేదని పలువురు విమర్శిస్తున్నారు. భూగర్భం లోపల చీకటి గనుల్లోని సొరంగాల్లో తగినంత గాలి, వెలుతురు లేని చోట్ల ప్రాణాలకు తెగించి పుట్టెడు కష్టాలు పడే గని కార్మికుల పరిస్థితులను పాలకులెవ్వరూ సరిగ్గా అర్ధం చేసుకోవడం లేదు. ఊపిరాడటం కష్టంగా ఉండే లోతైన పని స్థలాల్లో పై కప్పులు ఎప్పుడు కూలిపోతాయో తెలియని ప్రమాదకర పరిస్థితుల్లో గని కార్మికులు చిన్న హెడ్‌లైట్‌ సహాయంతో బొగ్గు తట్టలు మోయటం, పదునుగా, జారిపోయే విధంగా ఉండే అడుగు భాగాల మీదుగా లాడీసుల(బొగ్గు టబ్బుల) వరకు వేగంగా బొగ్గు తట్టలు మోయటం చాలా కష్టంగా ఉంటుంది. కార్మికులు తమ రక్తాన్ని చెమటగా మార్చుకుంటూ మూడు షిఫ్టుల్లో బొగ్గును ఉత్పత్తి చేసి గని ఉపరితలానికి పంపిస్తారు.
ఈ వ్యవహారంలో కార్మికులు బొగ్గు దూళీ, దుమ్ము, విష వాయువుల బారినపడి తీవ్ర అనారోగ్యానికి గురౌతుంటారు. బొగ్గు గని ఉపరితలం నుంచి లోపలి చీకటి సొరంగాల్లోని పనిస్థలాలకు వెళ్లి రావటానికే కార్మికులు ఎంతో శ్రమ పడుతుంటారు. ఆ తర్వాత కనీసం ఆరుగంటల పాటు బొగ్గు గనుల్లోపల చీకటి సొరంగాల్లో బొగ్గు ఉత్పత్తికై తమ శక్తినంతా ధారపోస్తారు. ఒక షిఫ్టులో ఎనిమిది గంటల పాటు బొగ్గు గనుల్లో కష్టపడి పనిచేసి ఇంటికి వచ్చిన తర్వాత తీవ్ర అలసట, మానసిక క్షోభకు గురౌతుంటారు. నిరంతరంగా జరుగుతున్న ఈ ప్రక్రియ వల్ల కార్మికులు కనీస సంతోషాన్ని, ఉల్లాసాన్ని పొందలేకపోతున్నారు. ఈ ఉద్యోగం మినహా మరో గత్యంతరం లేదన్న అభిప్రాయంతో వేలాదిమంది కార్మికులు తమ, తమ కుటుంబ సభ్యుల భవిష్యత్తుకోసమై అనివార్యంగా శ్రమను భరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కార్మికులు వివిధ రకాల జబ్బులతో అనారోగ్యానికి గురై విధులకు హాజరు కాలేకపోతున్నారు. గనుల వద్ద, కాలనీల వద్ద కనీస వైద్య సౌకర్యాలు లేనందువల్ల, కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురై చాలా రోజులపాటు విధులకు హాజరుకాలేకపోతున్నారు. అటు గనులపైన, ఇటు ఇళ్ల వద్ద కార్మికులు తమ గైర్హాజరు పట్ల తీవ్ర మానసిక క్షోభకు గురౌతున్నారు. కార్మికుల గైర్హాజరుకు గల ప్రధాన కారణాలను తెలుసుకోకుండా, వారి సంక్షేమం పట్ల శ్రద్ధ వహించకుండా 'గైర్హాజరు' అనే ఏకైక తప్పును పెద్దదిగా చేసి కార్మికులను ఉద్యోగాల్లోంచి 'డిస్మస్‌' చేయడం సింగరేణి సంస్థలో అతిపెద్ద కిరాతక చర్యగా మారిపోయింది. రాష్ట్రంలోని ఇతర ఏ సంస్థల్లో, పరిశ్రమల్లో లేననిన్న 'డిస్మిస్‌'లు కేవలం సింగరేణి సంస్థలోనే కొనసాగటాన్ని ప్రత్యేక దృష్టితో ప్రభుత్వం ఆలోచించాల్సి ఉంది. 1993 నుంచి 2011 వరకు సింగరేణి సంస్థలో పదివేల మంది కార్మికులు తమ ఉద్యోగాల నుంచి తొలగించబడ్డారు. తెలంగాణ జిల్లాల్లోని వేలాది మంది నిరుద్యోగులకు ఏకైక ఆశాకిరణంగా ఉన్న సింగరేణి సంస్థలో గత పదేళ్ల కాలంలో కొత్తగా ఉద్యోగావకాశాలు ఇవ్వకపోగా పదివేల మందికి పైగా కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగించి సింగరేణి యాజమాన్యం తెలంగాణ నిరుద్యోగులకు తీరని అన్యాయం చేస్తోంది. 
ఈ అన్యాయానికి వ్యతిరేకంగా అన్ని కార్మిక సంఘాలు పోరాడుతున్నాయి. యాజమాన్యానికి, ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తున్నాయి. ఈ మేరకు యాజమాన్యం ఒకసారి 66 మంది తొలగించిన కార్మికులను తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకున్నది. మరో 426 మంది తొలగించిన కార్మికులను తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవటానికి వారం రోజుల కిందటే గుర్తింపు పొందిన కార్మిక సంఘం టీబీజీకేఎస్‌తో ఒప్పందం కుదుర్చుకున్నది. తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవటానికి కూడా యాజమాన్యం విధిస్తున్న రకరకాల షరతులు వేలాది మంది కార్మికుల, వారి కుటుంబాల భవిష్యత్తుకు శాపాలుగా పరిణమిస్తున్నాయి. తమ విధులకు 'గైర్హాజరు' కారణాలను మానవతా దృక్పథంతో ఆలోచించాలని, తమకు తిరిగి ఉపాధి కల్పించి తమ భవిష్యత్తును కాపాడాలని డిస్మిస్డ్‌ కార్మికులు, వారి కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు. అన్ని కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలు ఈ డిస్మిస్డ్‌ కార్మికులకు అండగా నిలిచి, ఐక్యపోరాటం చేయాలని నిర్ణయించాయి. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఇది మరో బలమైన కారణంగా ఆవిర్భవించే అవకాశం ఉంది.