Thursday 28 February 2013


రామగుండం విద్యుత్‌ కేంద్ర విస్తరణ పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం

రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో పరిశ్రమల స్థాపనకు అవసరమైన అన్ని వసతులు పుష్కలంగా ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం గత నాలుగు దశాబ్దాలుగా ఈ ప్రాంత పారిశ్రామిక పురోగతి పట్ల తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నది. కొత్తగా పరిశ్రమలేవీ స్థాపించకపోగా గతంలోనే స్థాపించబడిన కొన్ని పరిశ్రమలను మూసివేసి తెలంగాణ అభివృద్ధికి 'గుండె' వంటి 'రామగుండం' పట్ల తీరని ద్రోహం చేస్తున్నది. తాజాగా కిరణ్‌కుమార్‌ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రేస్‌ పార్టీ ప్రభుత్వం థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల విస్తరణలో కూడా రామగుండం ప్రాంతాన్ని చెత్తబుట్టలో పడేసి ఆంధ్రాప్రాంతంలో విస్తరణ పథకాలను ఆమోదించటం తెలంగాణ అభివృద్ధికి మరోమారు విఘాతం కలిగిస్తున్నది. 

Entrance Way to B-Power Project
'థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం' ఎక్కడైనా నెలకొల్పాలంటే 'బొగ్గు', నీరు, రవాణా, స్థలము వంటి ప్రధాన అంశాలు అందుబాటులో ఉండాలనే సాంకేతిక నిపుణులు, పరిశ్రమల వ్యవస్థాపకులు చెబుతుంటారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఇవన్నీ పుష్కలంగా అందుబాటులో ఉన్నాయి. బ్రిటీష్‌ ఇంజనీర్లు 1948 సంవత్సరంలోనే రామగుండం ప్రాంతాన్ని 'మాంచెస్టర్‌ ఆఫ్‌ ఇండియా' గా అభివర్ణించారు. ఇక్కడ గోదావరి నది వల్ల పుష్కలంగా నీరు లభిస్తుంది. మద్రాస్‌-ఢిల్లీ గ్రాండ్‌ట్రంక్‌ రైలు మార్గంలో 'రామగుండం' రైల్వేస్టేషన్‌ ప్రముఖ రవాణా కేంద్రంగా ఉన్నది. హైదరాబాద్‌ నుండి మంచిర్యాల్‌ వరకు 'రాజీవ్‌ హైవే' ద్వారా దేశంలోని అన్ని ప్రధాన రోడ్డు మార్గాలకు రామగుండం లింక్‌ చేయబడింది. అంతర్గాం నుంచి బేగంపేట, రామగిరి ఖిల్లా వరకు దాదాపు యాభై కిలోమీటర్ల పొడవు, ఇరవై కిలోమీటర్ల వెడల్పైన విశాల ఖాళీ స్థలాలు అందుబాటులో ఉన్నాయి. థర్మల్‌ కేంద్రాలు ఏర్పాటుకు ప్రధాన ముడిసరుకుగా ఉండే 'బొగ్గు' రామగుండం నాలుగు డివిజన్లలోని సింగరేణి బొగ్గు గనుల్లో అందుబాటులో ఉన్నది. ఈ కారణాల దృష్ట్యా బ్రిటీష్‌, నిజాం ప్రభువుల కాలంలోనే ఇక్కడ రామగుండం 'తొలి దీపం' 'ఎ' థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం ఏర్పడింది.
ఆ తర్వాత 1971లో 'బి' థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం ఏర్పడింది. ఒక్కొక్కటి 60 మెగావాట్ల సామర్ధ్యంతో విద్యుత్తును ఉత్పత్తి చేశాయి. 1984లో తెలుగుదేశం ప్రభుత్వం సాంకేతిక కారణాలతో 'ఎ' థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాన్ని మూసివేశారు. ఆ తర్వాత అదే స్థలంలో బి.పి.ఎల్‌ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాన్ని నిర్మించటానికి ఏర్పాట్లు చేశారు. 520 మెగావాట్ల సామర్థ్యం గల రెండు యూనిట్లను ఏర్పాటు చేయటానికి అవసరమైన ఏర్పాట్లు చేశారు. బి.పి.ఎల్‌ సంస్థ ఇందుకోసమై దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి, స్థలాన్ని లెవలింగ్‌ చేయడం, కౌంపౌండు గోడ నిర్మించడం, పునాది తీయడం వంటి పనులు పూర్తి చేసింది. అలనాటి కాంగ్రేస్‌ ప్రభుత్వం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, రోశయ్య వంటి నేతల రాజకీయ చతురత, కక్షల మాటున 'పవర్‌ పర్చేజ్‌ అగ్రిమెంట్‌' (పీపీఏ) పేరిట బి.పి.ఎల్‌ నిర్మాణం పనులకు బ్రేకులు వేశారు. గత పదేళ్ల కాలం నుంచి ఈ ప్రాజెక్టు పునాదుల నుండి లేవలేదు. 
B-Thermal Power Project at Ramagundam

కాంగ్రేస్‌ పార్టీ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి ఏమాత్రం ఇష్టపడదనే ఆరోపణలకు బి.పి.ఎల్‌ థర్మల్‌ కేంద్రం ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచింది. రామగుండం 'బి' థర్మల్‌ కేంద్రంలో ప్రస్తుతం 62.5 మెగావాట్ల స్థాయిలో విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతున్నది. ఈ థర్మల్‌ విద్యుత్‌ కేంద్ర విస్తరణకు కావాల్సిన స్థలం, బొగ్గు, నీరు, రవాణా ఇప్పటికే అందుబాటులో ఉన్న కారణంగా అదనంగా కోట్లాది రూపాయల నిర్మాణపు ఖర్చులు తగ్గుతాయని, అందువల్ల 'బి' థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాన్ని కనీసం 600 మెగావాట్ల స్థాయికి విస్తరించాలని గత పదేళ్లుగా స్థానికులు కోరుతున్నారు. అన్ని రాజకీయ పార్టీల, కార్మిక సంఘాల నాయకులు దశాబ్ద కాలంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. రామగుండం తెలుగు యువత నేత సతీష్‌కుమార్‌ నేతృత్వంలో యువకులంతా గత రెండేళ్లుగా ముఖ్యమంత్రికి, రాష్ట్ర, జిల్లా మంత్రులకు విజ్ఞప్తులు చేస్తున్నారు. ఈ డిమాండ్‌పై రామగుండంలో పలుమార్లు రిలే నిరాహార దీక్షలు, రాస్తారోకోలు, ర్యాలీలు వంటి ఉద్యమ కార్యక్రమాలను నిర్వహించారు. కానీ కాంగ్రేస్‌ ప్రభుత్వం ఈ విజ్ఞప్తులను ఏమాత్రము ఖాతరు చేయలేదు. రాష్ట్రంలోని విజయవాడ, కృష్ణపట్నం, కొత్తగూడెంలలో థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల విస్తరణకు ప్రభుత్వం ఫిబ్రవరి 13 నాడే నిర్ణయించింది. రామగుండం విస్తరణ మరోమారు పాలకుల నిర్లక్ష్యానికి గురైందనటానికి ప్రభుత్వ నిర్ణయమే ప్రధాన సాక్షిగా మిగిలిపోతున్నది. విజయవాడ, కృష్ణపట్నంలలో థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల విస్తరణకు అవసరమైన ప్రధాన ముడిసరుకు 'బొగ్గు' అందుబాటులో లేదు. కృష్ణపట్నం ఓడరేవు ద్వారా విదేశాల నుండి బొగ్గు దిగుమతి చేసుకుని అక్కడ విద్యుత్‌ ఉత్సత్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రామగుండం వాకిట్లో బొగ్గు ఉన్నప్పటికీ ప్రభుత్వానికి రామగుండం విస్తరణ పట్ల ఆసక్తి లేకపోవటాన్ని గమనించాల్సి ఉంది. విదేశీ బొగ్గు దిగుమతి పేరిట కోట్లాది రూపాయల అవినీతి కమీషన్లు కాంగ్రేస్‌ ప్రభుత్వనేతలు మింగేశారని ఇప్పటికే ఆరోపణలున్నాయి. విస్తరణ పేరిట కృష్ణపట్నంలో మరింత అవినీతిని ఆశ్రయిస్తున్నారని పలువురు విద్యుత్‌ ఇంజనీరింగ్‌ నిపుణులు విమర్శిస్తున్నారు. విజయవాడ విస్తరణ వల్ల బొగ్గు రవాణా పేరిట కోట్లాది రూపాయలు ఖర్చు అదనంగా భరించాలన్న ఆలోచన ప్రభుత్వ నేతలకు లేదనటానికి వీలు లేదు. ఈ విస్తరణల్లోనూ రాజకీయ, అవినీతి స్వార్ధపర లక్షణాలు ఉన్నాయనేది స్పష్టంగా కనిపిస్తున్నది. 

రాష్ట్ర ప్రభుత్వం థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల విస్తరణలో 'రామగుండం' ప్రాంతానికి ఇంత అన్యాయం చేస్తున్నా తెలంగాణ కాంగ్రేస్‌ పార్టీ మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు సోయి రావటం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో పాల్గొనడానికి ధైర్య, సాహసాలు లేకున్నా, పట్టపగలు రాష్ట్రంలోని తమ పార్టీ ప్రభుత్వం రామగుండం పట్ల అనుసరిస్తున్న నిర్లక్ష్య విధానాలను ఎదిరించటం లేదు. 'పొలిటికల్‌ డామినేషన్‌' లేని కాంగ్రేస్‌ పార్టీ ప్రజాప్రతినిధులు తెలంగాణ అభివృద్ధి పట్ల పెద్ద 'స్పీడు బ్రేకర్లు'గా మారిపోయారని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. గత నలభై ఏళ్ల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కనీసం ఒక్కటంటే ఒక్క పరిశ్రమను స్థాపించకపోగా అప్పటికే అందుబాటులో ఉన్న పలు పరిశ్రమలను మూసివేసి ఈ ప్రాంతం పట్ల పాలకుల నిర్లక్ష్య వైఖరులను నిరూపించింది. రామగుండం పారిశ్రామిక ప్రాంతం అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మినహా మరో మార్గం లేదని తెలంగాణవాదులంతా నినదిస్తున్నారు. 
Report By PITTALA RAJENDER
Snr.Journalist, Godavarikhani