Wednesday 27 February 2013


పారిశ్రామిక ప్రాంతంలో పాలకుల పక్షపాతం?


గోదావరిఖని: ''రాజులు తల్చుకుంటే దెబ్బలకు కొదువా?'' అనేది పాతకాలపు సామెత పాలకులు తల్చుకుంటే కానిదేముంది? అనేది నేటి సామెత. అందులో కాంగ్రేస్‌ పార్టీ నేతలు అధికారంలో ఉంటే ఏదైనా జరగవచ్చునని పలువురు వ్యాఖ్యానిస్తుంటారు. రాష్ట్ర వ్యాపితంగా జరుగుతున్నట్టుగానే రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోనూ కాంగ్రేస్‌ పాలకులు అనేక చిత్ర విచిత్రాలు జరిపారు. దాదాపు మూడు దశాబ్దాల పాటు రామగుండం ప్రాంతంలో చురుకైన రాజకీయ పాత్ర నిర్వహించి, ఈ ప్రాంత అభివృద్ధిలో విశేషపాత్ర పోషించిన గీట్ల జనార్ధన్‌రెడ్డిని పాలకులు పూర్తిగా విస్మరించారు. గోదావరిఖని పట్టణ ఆవిర్భావానికి ముందు ఈ ప్రాంతాన్ని 'జనగామ', 'అడ్డగుంటపల్లి' అనే రెండు గ్రామాల పేర్లతో పిలిచేవారు. 1970 నుండి 1980 వరకు 'గోదావరిఖని' పేరిట సింగరేణి సంస్థ బొగ్గు గనులు త్రవ్వకాలు ప్రారంభించి, కాలనీలు విస్తరించేవరకు ఈ రెండు గ్రామాల పేరిటే గోదావరిఖని కొనసాగింది. వృత్తిరిత్యా ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా ఈ ప్రాంతానికి వచ్చిన గీట్ల జనార్ధన్‌రెడ్డి 1972 నుంచి తమ రాజకీయ జీవితం ప్రారంభించారు. 'జనగామ' గ్రామ సర్పంచ్‌గా ఎన్నికై 'గోదావరిఖని' ఒక పట్టణంగా రూపొందించటానికి కృషిచేశారు. విస్తరిస్తున్న సింగరేణి కాలనీలకు,
గుడిసెల ప్రాంతాలకు ఆయన స్వయంగా నామకరణం చేశారు. ఆయన సర్పంచ్‌గా కొనసాగిన కాలంలో నామకరణం చేయబడిన కాలనీలన్నీ ఇప్పటిదాకా అదే పేర్లతో వృద్ధి చెందటం విశేషంగా చెప్పుకుంటారు. గ్రామ పంచాయితీ వ్యవస్థ రద్దు చేసి, 'నోటిఫైడ్‌ ఏరియా కమిటీ' వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో స్థానిక స్వపరిపాలన కనుమరుగైంది. ఈ ప్రాంతంలో స్థానిక స్వపరి పాలన అమలులోకి తేవాలని గీట్ల జనార్ధన్‌రెడ్డి ఎంతగానో ఉద్యమించారు. స్థానిక పరిశ్రమల నుంచి పన్నులు వసూలు చేసి, స్థానిక స్వపరిపాలన ద్వారా స్థానికులకు కనీస సౌకర్యాలు కల్పించాలని ఆయన జిల్లా అధికారులకు ప్రభుత్వ నేతలకు అనేకమార్లు విజ్ఞప్తి చేశారు. మంథని సమితిలో ఈ గ్రామ పంచాయితీ పరిధి ఉన్న కారణంగా ఆయన మంథని పరిధిలోకి ప్రవేశిస్తే రానున్న కాలంలో మంథనిలో తమ రాజకీయ భవిష్యత్తు గందరగోళంలో పడుతుందని అప్పటి కాంగ్రేస్‌ నాయకులు పీ.వి.నర్సింహారావు, డి.శ్రీపాదరావు తదితరులు 'రామగుండం నోటిఫైడ్‌ ఏరియా కమిటీ' పేరిట నూతన పాలనా విధానాన్ని ప్రవేశపెట్టినట్టు అప్పటి నుంచి ఆరోపణలు ఉన్నాయి. రామగుండం, గోదావరిఖని పరిసరాల్లోని తొమ్మిది గ్రామపంచాయితీలను రద్దు చేసి నోటిఫైడ్‌ ఏరియా పేరిట ప్రభుత్వం కొత్త పాలనావ్యవస్థను ప్రవేశపెట్టింది. స్థానికుల నిరసనల మేరకు జిల్లా కలెక్టర్‌ నేతృత్వంలో కొనసాగిన నామినేటెడ్‌ వ్యవస్థ స్థానంలో, రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ప్రజాప్రతినిధులతో కూడిన నోటిఫైడ్‌ ఏరియా కమిటీ పాలనను అధికారంలోకి తెచ్చింది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన కమిటీలో గీట్ల జనార్ధన్‌రెడ్డి సభ్యుడిగా నియామకం పొందారు. తాను ఆ కమిటీలో కొనసాగుతూనే ఇక్కడ విస్తరించిన జనాభాననుసరించి 'మున్సిపాలిటీ' ఏర్పాటు చేయాలని కోరారు. టీడీపీ నేత ఎన్టీఆర్‌ ఆ రోజుల్లోనే గీట్ల జనార్ధన్‌రెడ్డి రాజకీయ చతురతను, మేధావి లక్షణాలను గమనించి తన అంతరంగిక పార్టీ కార్యదర్శిగా నియమించారు. అనంతరం ఆయనను టీడీపీ ప్రభుత్వం ఎమ్మెల్సీగా కూడా గెలిపించుకున్నది. ఆ తర్వాత స్థానిక స్వపరిపాలనకై కొనసాగిన ఉద్యమాల కారణంగా రాష్ట్ర ప్రభుత్వం 'రామగుండం మున్సిపల్‌ కౌన్సిల్‌' వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఆ తర్వాత దశాబ్ద కాలానికి 'రామగుండం మున్సిపల్‌ కార్పోరేషన్‌'గా ఈ ప్రాంతం అవతరించింది. మూడు దశాబ్దాల పాటు ఈ ప్రాంతంలోని ప్రజల సంక్షేమానికి కృషిచేసిన 'గీట్ల జనార్ధన్‌రెడ్డి'ని కాంగ్రేస్‌ పాలకులు పూర్తిగా విస్మరించటం స్థానికులకు తీరని ఆవేదనగా మారింది. లక్షలాది రూపాయలు ఖర్చు చేసి అనేక విగ్రహాలు నెలకొల్పిన మున్సిపల్‌ కార్యవర్గాలు గీట్ల జనార్ధన్‌రెడ్డి పేరిట కనీసం ఒక్క విగ్రహాన్ని నెలకొల్పలేదు. పైగా ఈ ప్రాంతం పట్ల ఏనాడు పట్టించుకోని మంథని మాజీ శాసనసబ్యుడు, శాసనసభ మాజీ స్పీకర్‌ డి.శ్రీపాదరావు విగ్రహాన్ని గోదావరిఖని బస్టాండు ఎదురుగా ప్రతిష్టించారు.
Sripada Rao statue opposite GDK Bust Stand
 రామగుండం, గోదావరిఖని ప్రాంతంలో కొనసాగిన రాజకీయ, పారిశ్రామిక పురోగతిలో శ్రీపాదరావు ఏనాడు పట్టించుకోలేదు. సీనియర్‌ నాయకులు జి.ఈశ్వర్‌, జి.వెంకటస్వామి తదితరుల నేతృత్వంలోనే ఈ ప్రాంతంలో కాంగ్రేస్‌ పార్టీ, తదితర అనుబంధ కార్మిక సంఘాలు బలపడ్డాయి. మూడు దశాబ్దాల కాలంలో గోదావరిఖని, రామగుండం ప్రాంతాలలో ఏనాడూ రాజకీయ కార్యకలాపాలు పట్టించుకోని 'శ్రీపాదరావు' విగ్రహాన్ని బస్టాండు ఎదురుగా ఏర్పాటు చేయటంతో పాటు, రామగుండం సమీపంలోని ఎల్లంపల్లి వద్ద గోదావరినదిపై నిర్మించిన ఆనకట్టకు కూడా 'శ్రీపాదసాగర్‌' అని నామకరణం చేయటం స్థానికులకు తీవ్ర అసంతృప్తి కలిగించింది. కాంగ్రేస్‌ పార్టీ నేతలకు స్థానిక ప్రజల అభిప్రాయాలు తెలుసుకునే అవసరం లేనట్టు స్పష్టమైంది. జిల్లా మంత్రి ఏకపక్ష నిర్ణయాన్ని స్థానిక నేతలు కళ్లు, చెవులు మూసుకుని ఆమోదించి స్థానిక ప్రజల్లో అప్రతిష్టపాలయ్యారు. 'రామగుండం-హైదరాబాద్‌' హైవే సృష్టించి అమలు పరిచిన మాజీ ప్రధానమంత్రి పి.వి.నర్సింహారావుపైన కూడా స్థానిక కాంగ్రేస్‌ నేతలకు దయకలగలేదు. కనీసం ఈ జిల్లా వ్యక్తిగా గుర్తించకుండా, ఆయన విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయలేదు. మూడు దశాబ్దాలు ఈ ప్రాంత ప్రజల సంక్షేమానికై కృషి చేసిన గీట్ల జనార్ధన్‌రెడ్డి పట్ల కూడా స్థానిక కాంగ్రేస్‌ నేతలకు సానుభూతి కలగలేదు. గీట్ల జనార్ధన్‌రెడ్డి మరణించేవరకు ఈ ప్రాంత పురోగతికై (జి.పి.పి.పి.పి.జి) గోదావరి పర్యావరణ పరిరక్షణ పేరిట స్థానిక పరిశ్రమల యాజమాన్యాల సహకారంతో లక్షలాది మొక్కలను నాటించి పర్యావరణ పరిరక్షణకై కృషి చేశారు. పాలకులు ఏ పార్టీ వారైనా ప్రజా సంక్షేమానికై కృషిచేసే వ్యక్తులను గుర్తించి, ప్రోత్సహించి, గౌరవించాలే గానీ అధికారం తమ చేతుల్లో ఉందనే ధీమాతో ప్రజావ్యతిరేక చర్యలు చేపడితే రానున్న కాలంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొక తప్పదని పలువురు విమర్శిస్తున్నారు. 


A post by PITTALA RAJENDER
Snr.Journalist, Godavarikhani