ఎన్టీపీసీ వద్ద ఎమ్మెల్యే మహాధర్నా
స్థానిక ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ నేతృత్వంలో టీఆర్‌ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు ఆదివారం సాయంత్రం ఎన్టీపీసీ జ్యోతినగర్‌లో మహాధర్నా నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్, వందలాది మంది కార్యకర్తలు, టీఆర్‌ఎస్ పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు. జ్యోతినగర్, గోదావరిఖనిల మధ్య ఉన్న ఖాళీ స్థలాన్ని మెడికల్ కాలేజీకి, ఐ.టి.పార్కుకు కేటాయించాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. నివాసాల మధ్య ఉన్న ఖాళీ స్థలాన్ని ఎన్టీపీసీ ప్రాజెక్టు అవసరాలకు గ్రామస్తులు నాలుగు దశాబ్దాల కిందట ధారాదత్తం చేశారని, ఈ స్థలంలో ఎన్టీపీసి యాజమాన్యం 25మెగావాట్ల సామర్ధ్యం గల సోలార్ పవర్ స్టేషన్‌ను ఏర్పాటు చేయటానికి సన్నహాలు చేస్తున్నదని ఎమ్మెల్యే వివరించారు.
ఈ సోలార్ పవర్ స్టేషన్ వల్ల చుట్టుపక్కల గల కాలనీవాసులకు రేడియేషన్ ప్రభావం కలిగించే అవకాశం ఉందని ఆయన అన్నారు. ఎన్టీపీసీ రామగుండం ప్రాజెక్టు పరిధిలో వందలాది ఎకరాల ఖాళీ స్థలం అందుబాటులో ఉందని, అందువల్ల సోలార్ పవర్ స్టేషన్ వేరే స్థలంలో నిర్మించి, ప్రస్తుత స్థలాన్ని స్థానిక ప్రజల అవసరాలకు కేటాయించాలని ఎమ్మెల్యే కోరుతున్నారు. ఈ మేరకు ఆయన ఎన్టీపీసీ అధికారులకు, జిల్లా కలెక్టర్‌కు, రాష్ట్ర ముఖ్యమంత్రికి విజ్ఞప్తి పత్రాలు ఇచ్చినట్లు ఎమ్మెల్యే వివరించారు. కాగా ఎన్టీపీసీ యాజమాన్యం ప్రతిపాదించిన సోలార్ పవర్ ప్లాంటును అదే స్థలంలో నిర్మించనున్నట్లు ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ఎన్టీపిసి కింద భూములు, ఇళ్లు కోల్పోయిన నిర్వాసితులు సంక్షేమానికి తాము అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని యాజమాన్యం వివరించింది. ప్రస్తుతం జరుగుతున్న థర్మల్ విద్యుత్ ఉత్పత్తికి తోడుగా అదనంగా విద్యుత్తును ఉత్పత్తి చేయటానికే ఈ సోలార్ పవర్ ప్లాంటును నెలకొల్పుతున్నట్లు యాజమాన్యం ప్రకటించింది.