రామగుండం విద్యుత్ కేంద్ర విస్తరణ పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం
రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో పరిశ్రమల స్థాపనకు అవసరమైన అన్ని వసతులు పుష్కలంగా ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం గత నాలుగు దశాబ్దాలుగా ఈ ప్రాంత పారిశ్రామిక పురోగతి పట్ల తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నది. కొత్తగా పరిశ్రమలేవీ స్థాపించకపోగా గతంలోనే స్థాపించబడిన కొన్ని పరిశ్రమలను మూసివేసి తెలంగాణ అభివృద్ధికి 'గుండె' వంటి 'రామగుండం' పట్ల తీరని ద్రోహం చేస్తున్నది. తాజాగా కిరణ్‌కుమార్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రేస్ పార్టీ ప్రభుత్వం థర్మల్ విద్యుత్ కేంద్రాల విస్తరణలో కూడా రామగుండం ప్రాంతాన్ని చెత్తబుట్టలో పడేసి ఆంధ్రాప్రాంతంలో విస్తరణ పథకాలను ఆమోదించటం తెలంగాణ అభివృద్ధికి మరోమారు విఘాతం కలిగిస్తున్నది.
|
Entrance Way to B-Power Project |
'థర్మల్ విద్యుత్ కేంద్రం' ఎక్కడైనా నెలకొల్పాలంటే 'బొగ్గు', నీరు, రవాణా, స్థలము వంటి ప్రధాన అంశాలు అందుబాటులో ఉండాలనే సాంకేతిక నిపుణులు, పరిశ్రమల వ్యవస్థాపకులు చెబుతుంటారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఇవన్నీ పుష్కలంగా అందుబాటులో ఉన్నాయి. బ్రిటీష్ ఇంజనీర్లు 1948 సంవత్సరంలోనే రామగుండం ప్రాంతాన్ని 'మాంచెస్టర్ ఆఫ్ ఇండియా' గా అభివర్ణించారు. ఇక్కడ గోదావరి నది వల్ల పుష్కలంగా నీరు లభిస్తుంది. మద్రాస్-ఢిల్లీ గ్రాండ్‌ట్రంక్ రైలు మార్గంలో 'రామగుండం' రైల్వేస్టేషన్ ప్రముఖ రవాణా కేంద్రంగా ఉన్నది. హైదరాబాద్ నుండి మంచిర్యాల్ వరకు 'రాజీవ్ హైవే' ద్వారా దేశంలోని అన్ని ప్రధాన రోడ్డు మార్గాలకు రామగుండం లింక్ చేయబడింది. అంతర్గాం నుంచి బేగంపేట, రామగిరి ఖిల్లా వరకు దాదాపు యాభై కిలోమీటర్ల పొడవు, ఇరవై కిలోమీటర్ల వెడల్పైన విశాల ఖాళీ స్థలాలు అందుబాటులో ఉన్నాయి. థర్మల్ కేంద్రాలు ఏర్పాటుకు ప్రధాన ముడిసరుకుగా ఉండే 'బొగ్గు' రామగుండం నాలుగు డివిజన్లలోని సింగరేణి బొగ్గు గనుల్లో అందుబాటులో ఉన్నది. ఈ కారణాల దృష్ట్యా బ్రిటీష్, నిజాం ప్రభువుల కాలంలోనే ఇక్కడ రామగుండం 'తొలి దీపం' 'ఎ' థర్మల్ విద్యుత్ కేంద్రం ఏర్పడింది.